ఏఐ భవిష్యత్తుకు కొత్త ఇంధనం.. ఐబీఎం సరికొత్త చిప్‌ టెక్నాలజీ

IBM Unveils New Chip Technology as Fuel for Future of AI
  • తొలి 0.7 నానోమీటర్‌ చిప్‌ టెక్నాలజీని ఆవిష్కరించిన ఐబీఎం
  • ‘నానోస్టాక్‌’ అనే కొత్త 3డీ ట్రాన్సిస్టర్‌ నిర్మాణం వినియోగం
  • గోరు గోటి పరిమాణంలో 100 బిలియన్‌ ట్రాన్సిస్టర్లు
  • 2 నానోమీటర్‌ చిప్‌ల కంటే రెట్టింపు ట్రాన్సిస్టర్‌ సాంద్రత
  • 50% అధిక పనితీరు లేదా 70% ఎక్కువ విద్యుత్‌ సామర్థ్యం
  • ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు భారీ ఊతం
కంప్యూటర్‌ చిప్‌ల అభివృద్ధిలో మరో చరిత్రాత్మక మైలురాయి నమోదైంది. అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం  ప్రపంచంలోనే తొలి సబ్‌-1 నానోమీటర్‌ (0.7 నానోమీటర్‌) చిప్‌ టెక్నాలజీని ఆవిష్కరించింది. ప్రస్తుతం సెమీకండక్టర్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న భౌతిక పరిమితులను దాటే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

ఈ కొత్త చిప్‌ను 0.7 నానోమీటర్‌ లేదా 7 ఆంగ్‌స్ట్రామ్‌ ప్రాసెస్‌ నోడ్‌పై రూపొందించారు. ఇందులో ‘నానోస్టాక్‌’ అనే సరికొత్త త్రీ-డైమెన్షనల్‌ ట్రాన్సిస్టర్‌ నిర్మాణాన్ని ఉపయోగించారు. దీని ద్వారా అణు స్థాయిలోనే మరింత అధిక పనితీరు, తక్కువ విద్యుత్‌ వినియోగం సాధ్యమవుతుందని ఐబీఎం తెలిపింది. గోరు గోటి పరిమాణంలో ఉండే ఈ చిప్‌లో దాదాపు 100 బిలియన్‌ ట్రాన్సిస్టర్లు అమర్చారు. 2021లో ఐబీఎం పరిచయం చేసిన 2 నానోమీటర్‌ చిప్‌తో పోలిస్తే ట్రాన్సిస్టర్‌ సాంద్రత దాదాపు రెట్టింపు కావడం విశేషం.

ఈ టెక్నాలజీ వల్ల 2 నానోమీటర్‌ చిప్‌లతో పోలిస్తే 50 శాతం అధిక పనితీరు లేదా 70 శాతం ఎక్కువ విద్యుత్‌ సామర్థ్యం లభించే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. జనరేటివ్‌ ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, భవిష్యత్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాల అవసరాలను తీర్చడంలో ఈ చిప్‌ కీలక పాత్ర పోషించనుంది. ఐబీఎం రీసెర్చ్‌ డైరెక్టర్‌ జే గంబెట్టా మాట్లాడుతూ.. ఈ ఆవిష్కరణ కంప్యూటింగ్‌ను నానోమీటర్‌ యుగం నుంచి అణు స్థాయి యుగంలోకి తీసుకెళ్తుందని అన్నారు.

నానోస్టాక్‌ నిర్మాణంలో ట్రాన్సిస్టర్లను నిలువుగా అమర్చడం వల్ల ఒకే చిప్‌లో మరిన్ని భాగాలను పొందుపరచవచ్చని, అలాగే పనితీరు, విద్యుత్‌ వినియోగాన్ని విడివిడిగా మెరుగుపర్చే అవకాశం ఉంటుందని కంపెనీ వివరించింది. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలోని అల్బనీ సెమీకండక్టర్‌ పరిశోధనా కేంద్రంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఈ సాంకేతికత ఆధారంగా రూపొందిన చిప్‌లు వచ్చే ఐదేళ్లలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఐబీఎం అంచనా వేస్తోంది.
Look at Shorts
IBM
Sub 1 nanometer chip technology
NanoStack transistor
Artificial Intelligence future
Semiconductor industry innovation
Jay Gambetta

More Telugu News