ఏనుగు పేడతో కాఫీ.. ఒక్క కప్పు ధర రూ.4,700!
- ఏనుగు పేడ నుంచి సేకరించిన గింజలతో కాఫీ తయారీ
- ‘బ్లాక్ ఐవరీ కాఫీ’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
- ఒక్క కప్పు ధర దాదాపు రూ.4,700
- కిలో ధర 2,000 డాలర్ల వరకు ఉండొచ్చు
- థాయ్‌లాండ్‌లో పరిమిత స్థాయిలో ఉత్పత్తి
- ఏనుగుల జీర్ణవ్యవస్థలో సహజ ప్రాసెసింగ్
ఏంటీ బ్లాక్ ఐవరీ కాఫీ?
థాయ్‌లాండ్‌లో తయారయ్యే ‘బ్లాక్ ఐవరీ కాఫీ’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ రకాలలో ఒకటి. దీని ధర కిలోకు దాదాపు 2,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక్క కప్పు కాఫీ ధరే సుమారు 50 డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4,700కు పైమాటే. ఈ కాఫీ ప్రత్యేకత ఏంటంటే... గింజలను ఏనుగుల జీర్ణవ్యవస్థ ద్వారా ప్రాసెస్ చేస్తారు.
తయారీ విధానం ఇదే
కాఫీ గింజలను బియ్యం, అరటిపండ్లు, ఇతర పండ్లతో కలిపి ఏనుగులకు ఆహారంగా ఇస్తారు. ఆహారం జీర్ణమయ్యే సమయంలో కాఫీ గింజలు కూడా ప్రత్యేక ప్రక్రియకు లోనవుతాయి. 15 నుంచి 17 గంటల తర్వాత ఏనుగుల మల విసర్జన నుంచి ఆ గింజలను సేకరించి శుభ్రపరుస్తారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి కాఫీ తయారు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల కాఫీకి ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుందని కాఫీ ప్రియులు చెబుతున్నారు.
అంత ఖరీదెందుకు?
ఈ కాఫీ తయారీ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. గింజల సేకరణ నుంచి ప్రాసెసింగ్ వరకు ప్రతి దశలో అధిక శ్రమ అవసరం. అలాగే ఉత్పత్తి పరిమితంగా ఉండటం కూడా ధర పెరగడానికి కారణం. కాఫీలో చాక్లెట్, నట్స్, మట్టి వాసనల మిశ్రమ రుచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏనుగుల ఆరోగ్యానికి హాని కలగకుండా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తయారీ సంస్థలు పేర్కొంటున్నాయి.