పవన్ పై వ్యాఖ్యలు... దువ్వాడ శ్రీనివాస్‌ను విచారిస్తున్న పోలీసులు
- పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు
- శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన దువ్వాడ
- దువ్వాడ అనుచరులను బయటే ఆపేసిన పోలీసులు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దువ్వాడ శ్రీనివాస్ భారీ సంఖ్యలో తన అనుచరులను వెంటబెట్టుకుని కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే విచారణకు అంతమంది రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేదంటూ దువ్వాడ అనుచరులను పీఎస్ బయటే అడ్డుకున్నారు.
తమను లోపలికి పంపించాలంటూ దువ్వాడ అనుచరులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి, తోపులాటకు దిగారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు దివ్వెల మాధురి, వారి అడ్వొకేట్‌ను మాత్రమే పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించారు. మిగిలిన వారందరినీ బయటే నిలిపివేశారు. ప్రస్తుతం పోలీసులు దువ్వాడ శ్రీనివాస్‌ను విచారిస్తున్నారు.