బల్లిని చూసి కొంతమంది ఎందుకు అంతలా భయపడిపోతారు?
- మెదడు హెచ్చరిక వ్యవస్థే అసలు కారణం
- చిన్ననాటి జ్ఞాపకాలూ భయాన్ని పెంచుతాయి
- కుటుంబ ప్రభావం కూడా కీలకమే
- ఆకస్మిక కదలికలతో ఆందోళన
- కొందరిలో ఫోబియాగా మారే ప్రమాదం
- చికిత్సతో భయాన్ని అధిగమించే అవకాశం
మెదడు ఇచ్చే హెచ్చరిక
బల్లులు వేగంగా కదలడం, అకస్మాత్తుగా కనిపించడం చాలామందిలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ప్రమాదం లేకపోయినా మెదడు దాన్ని ఒక ముప్పుగా భావించి ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ ప్రతిస్పందనను యాక్టివేట్ చేస్తుంది. దీంతో గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణుకు రావడం, అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలనే భావన కలుగుతుంది. కొందరిలో ఇది భయం కంటే అసహ్యం లేదా విరక్తి రూపంలో కూడా కనిపించవచ్చు.
చిన్ననాటి అనుభవాల ప్రభావం
ఈ భయం చాలా సందర్భాల్లో చిన్నప్పుడే మొదలవుతుంది. ఇంట్లో పెద్దలు బల్లిని చూసి భయపడటం, అరవడం చూసి పిల్లలు కూడా అదే ప్రవర్తనను నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే బల్లి ఒక్కసారిగా మీద పడటం లేదా దగ్గరగా కనిపించడం వంటి అనుభవాలు మెదడులో బలమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఆ జ్ఞాపకాలు పెద్దయ్యాక కూడా భయాన్ని కొనసాగిస్తాయి.
ఎప్పుడు ఫోబియాగా మారుతుంది?
బల్లిని చూసి ఒక్కసారి భయపడటం సహజం. కానీ బల్లి ఉంటుందేమోనని గదుల్లోకి వెళ్లకుండా ఉండటం, గోడలు పదేపదే పరిశీలించడం, ఒంటరిగా ఇంట్లో ఉండలేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడితే అది ఫోబియాగా మారినట్లే. అయితే దీనికి చికిత్స ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), క్రమంగా భయాన్ని తగ్గించే ఎక్స్‌పోజర్ థెరపీ వంటి పద్ధతులతో ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.