Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

4 రోజులు నిద్ర తగ్గితే చాలు.. డయాబెటిస్ ముప్పు పెరుగుతుందా?

Diabetes risk increases with just four days of poor sleep
Advertisement
  • కేవలం నాలుగు రోజుల నిద్రలేమి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచవచ్చు
  • నిద్ర సరిగా లేకపోతే కణాలు ఇన్సులిన్‌కు తక్కువగా స్పందిస్తాయి.
  • రక్తంలో గ్లూకోజ్ ఎక్కువసేపు ఉండిపోవడంతో మధుమేహ ముప్పు
  • ఘ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లపై ప్రభావం వల్ల ఆకలి ఎక్కువ
  • ఉదయం అలసట, తీపి తినాలనే కోరికలే సంకేతాలు
Advertisement
‘రాత్రి సరిగా నిద్రపోలేదు.. ఉదయం లేవగానే నీరసంగా ఉంది. ఆకలి కూడా ఎక్కువగా వేస్తోంది’.. చాలామంది దీన్ని సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ నిపుణులు మాత్రం ఇది శరీరం పంపుతున్న హెచ్చరిక అని చెబుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం కేవలం నాలుగు రోజుల పాటు నాణ్యమైన నిద్ర లేకపోతే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగే ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలకు దారితీయొచ్చు.

నిద్ర తగ్గితే ఏం జరుగుతుంది?
మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం రక్తంలో చక్కెర స్థాయులను బ్యాలెన్స్‌ చేస్తుంది. కానీ నిద్ర సరిగా లేకపోతే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. కణాలు ఇన్సులిన్‌కు తక్కువగా స్పందించడం మొదలవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువసేపు ఉండిపోతుంది. ఈ పరిస్థితినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది మధుమేహానికి తొలి మెట్టు అని వైద్యులు చెబుతున్నారు.

ఉదయాన్నే ఆకలి ఎందుకు?
నిద్ర నాణ్యత తగ్గితే ఆకలి, తృప్తిని నియంత్రించే ఘ్రెలిన్, లెప్టిన్ హార్మోన్ల పనితీరు మారుతుంది. ఫలితంగా ఉదయం లేవగానే విపరీతమైన ఆకలి వేస్తుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలపై కోరిక పెరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు మరింత అస్థిరంగా మారతాయి.

కనిపించే ప్రమాద సంకేతాలు
ప్రతిరోజూ అలసటగా ఉండటం, మధ్యాహ్నం శక్తి ఒక్కసారిగా తగ్గిపోవడం, తీపి పదార్థాలపై కోరిక పెరగడం, సాధారణ ఆహారం తీసుకున్నా బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ నిద్రలేమి జీవక్రియలపై చూపుతున్న ప్రభావానికి సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?
షిఫ్ట్ ఉద్యోగులు, రాత్రి వేళల్లో పనిచేసేవారు, అధిక ఒత్తిడితో జీవించే వారు, ఇప్పటికే మధుమేహ ప్రమాదం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వీరిలో నిద్రలేమి ప్రభావం మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

ఎలా నివారించాలి?
రోజుకు 7-8 గంటల నాణ్యమైన నిద్ర పోవడం ముఖ్యం. రోజూ ఒకే సమయంలో పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రివేళ మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగం తగ్గించాలి. పడుకునే ముందు ఎక్కువ తినొద్దు. ఒత్తిడిని నియంత్రించడం కూడా మంచి నిద్రకు సాయపడుతుంది.
Advertisement
Advertisement
Diabetes
Sleep deprivation
Insulin resistance
Blood sugar levels
Health tips
Weight gain

More Telugu News