నది మధ్యలో వంతెన నిర్మాణం.. ఇంజనీర్లు వాడే అసలు టెక్నిక్ ఇదేన‌ట‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నది మధ్యలో వంతెన నిర్మాణం.. ఇంజనీర్లు వాడే అసలు టెక్నిక్ ఇదేన‌ట‌!

Bridge construction in the middle of the river Here is the actual technique engineers use
  • నదుల మధ్యలో వంతెన పిల్లర్ల నిర్మాణం
  • కాఫర్‌డ్యామ్‌లతో నీటిని తోడేసి పొడి ప్రదేశం ఏర్పాటు
  • లోతైన నీటి కోసం 'కెయిసాన్' అనే ప్రత్యేక పద్ధతి
  • వంతెన భారాన్ని గట్టి నేలపైకి చేరవేసే ఇంజనీరింగ్
  • నీటి ఒత్తిడి, ప్రవాహాన్ని తట్టుకునేలా పటిష్ఠ‌ నిర్మాణం
ప్రతిరోజూ మనం ఎన్నో నదులపై నిర్మించిన వంతెనలను దాటుతుంటాం. అయితే, ఉద్ధృతంగా ప్రవహించే నీటి మధ్యలో ఇంత బలమైన, పటిష్ఠ‌మైన పిల్లర్లను ఎలా నిర్మిస్తారనే సందేహం చాలామందికి వస్తుంది. దీని వెనుక ఇంజనీర్ల అద్భుతమైన నైపుణ్యం, ప్రత్యేకమైన సాంకేతిక పద్ధతులు ఉన్నాయి. 

ప్రవహించే నీటిలో పొడి, సురక్షితమైన పని ప్రదేశాన్ని సృష్టించడం ఈ ప్రక్రియలో అతిపెద్ద సవాలు. దీనికోసం ప్రధానంగా కాఫర్‌డ్యామ్, కెయిసాన్ అనే రెండు పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తారు.

సాధారణంగా ఎక్కువగా వాడే పద్ధతి కాఫర్‌డ్యామ్. వంతెన నిర్మాణం ప్రారంభించడానికి ముందు, ఇంజనీర్లు నది లోతు, నీటి ప్రవాహ వేగం, నది గర్భంలోని నేల స్వభావాన్ని క్షుణ్ణంగా సర్వే చేస్తారు. ఆ తర్వాత, పిల్లర్ నిర్మించాలనుకున్న ప్రదేశం చుట్టూ, ఒకదానితో ఒకటి బలంగా అతుక్కునే పొడవైన స్టీల్ షీట్లను భారీ హైడ్రాలిక్ లేదా వైబ్రేటరీ సుత్తుల సహాయంతో నది గర్భంలోకి లోతుగా పంపిస్తారు. 

దీనివల్ల నీరు చొరబడని ఒక తాత్కాలిక గోడలాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ తర్వాత, దాని లోపల ఉన్న నీటిని శక్తిమంతమైన పంపులతో పూర్తిగా బయటకు తోడేస్తారు. దీంతో నది మధ్యలో నిర్మాణ పనులకు వీలుగా పొడి ప్రదేశం తయారవుతుంది.

ఈ పొడి ప్రదేశంలో కార్మికులు లోపలికి దిగి, మట్టిని తవ్వి ఫౌండేషన్ పనులు ప్రారంభిస్తారు. అవసరమైతే, మరింత గట్టి పొరలు చేరే వరకు స్టీల్ లేదా కాంక్రీట్ పైల్స్‌ను భూమిలోకి లోతుగా వేస్తారు. ఆపై రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్‌తో పిల్లర్ ఫౌండేషన్, ఆ తర్వాత పిల్లర్‌ను నిర్మిస్తారు. నిర్మాణం సమయంలో నీటి లీకేజీ జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తారు. పిల్లర్ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ తాత్కాలిక స్టీల్ గోడను తొలగిస్తారు.

ఒకవేళ నది లోతు చాలా ఎక్కువగా ఉన్నా, లేదా ఇతర క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా 'కెయిసాన్' అనే మరో పద్ధతిని ఉపయోగిస్తారు. ఇవి నీరు చొరబడని భారీ పెట్టెల వంటి నిర్మాణాలు. వీటిని నీటిపై తేలియాడేలా తీసుకొచ్చి, నిర్దేశిత ప్రదేశంలో నది గర్భంలోకి ముంచుతారు. ఆ తర్వాత దాని లోపల నుంచే మట్టిని తొలగిస్తూ ఫౌండేషన్ పనులు చేపడతారు. 

ఈ పద్ధతుల ద్వారా వంతెన మొత్తం భారాన్ని నది గర్భంలోని గట్టి నేలపైకి సురక్షితంగా బదిలీ చేస్తారు. అందుకే నదులపై నిర్మించిన వంతెనలు దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలబడతాయి.
Advertisement
Bridge Construction
Cofferdam Technique
Caisson Method
Civil Engineering
River Bridge Pillars
Foundation Engineering

More Telugu News