దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? కారణం ఇదేనట!
- శరీరం నుంచి వెలువడే వాసనే ప్రధాన కారణం
- కార్బన్‌డైఆక్సైడ్‌ను దూరం నుంచే గుర్తించే దోమలు
- గర్భిణులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం
- బ్లడ్ గ్రూపుతో సంబంధం లేదన్న నిపుణులు
- బీర్ తాగిన వారిపై ఎక్కువ ఆకర్షణ
వాసనే ప్రధాన కారణం
మన శరీరం నుంచి వెలువడే వాసన దోమలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మంపై ఉండే సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే రసాయనాల కలయిక ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. ఈ వాసనల ఆధారంగానే దోమలు తమ లక్ష్యాన్ని ఎంచుకుంటాయి. కొందరి శరీరం నుంచి వచ్చే రసాయనాలు దోమలకు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
కార్బన్‌డైఆక్సైడ్‌తో గుర్తింపు
మనం ఊదే శ్వాసలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను దోమలు చాలా దూరం నుంచే గుర్తిస్తాయి. ఇది వాటికి తొలి సంకేతంగా పనిచేస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత శరీర వాసనను పసిగడతాయి. ఆ తర్వాత శరీర ఉష్ణోగ్రత, తేమ స్థాయులను గుర్తించి ఎవరిని కుట్టాలో నిర్ణయించుకుంటాయి.
గర్భిణులు ఎక్కువగా టార్గెట్
పరిశోధనల్లో మరో ఆసక్తికర విషయం బయటపడింది. గర్భధారణ రెండో దశలో ఉన్న మహిళలను దోమలు ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. వారి శరీరంలో ‘1-ఆక్టెన్-3-ఆల్’ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం. ఈ పదార్థం పరిమాణం కొద్దిగా పెరిగినా దోమల ఆకర్షణ గణనీయంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
బ్లడ్‌గ్రూపుతో సంబంధం లేదు
దోమలు కొన్ని బ్లడ్‌గ్రూపులను మాత్రమే ఇష్టపడతాయనే ప్రచారం చాలా కాలంగా ఉంది. కానీ దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మం రంగు, కళ్ల రంగు, జుట్టు రంగుతో కూడా దీనికి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా శరీర నుంచి వెలువడే వాసనే కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటున్నారు.
బీర్ తాగితే ముప్పు ఎక్కువ
మద్యం సేవించిన వారిని కూడా దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బీర్ తాగిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కార్బన్‌డైఆక్సైడ్ విడుదల కూడా అధికమవుతుంది. చర్మ వాసనలో మార్పులు రావడంతో దోమలు అలాంటి వారిని సులభంగా గుర్తిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.