కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు
- ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ కోల్‌కతా పర్యటన
- ఈవీ, సోలార్, స్టీల్, ఆగ్రో రంగాల దిగ్గజాలతో వరుస భేటీలు
- రాయలసీమలో సోలార్ హబ్, నెల్లూరులో ఈవీ యానోడ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
- అమరావతి, పారిశ్రామిక కారిడార్లను చూపుతూ పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కంపెనీల ప్రతినిధుల హామీ
భవిష్యత్ సాంకేతికత, హరిత ఇంధనంపై దృష్టి
హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ సీఎండీ అనురాగ్ చౌదరితో భేటీ అయిన మంత్రి లోకేశ్, రాష్ట్రంలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. "దక్షిణ భారతదేశ ఈవీ తయారీ కారిడార్‌కు ఏపీని కీలక సరఫరాదారుగా మార్చాలన్నది మా సంకల్పం. నెల్లూరు లేదా చిత్తూరు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో మీ యూనిట్ ఏర్పాటు చేయండి" అని లోకేశ్ ప్రతిపాదించారు. దీనితో పాటు, ఐఐటీ తిరుపతి లేదా ఆంధ్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో అమరావతిలో ఒక అధునాతన మెటీరియల్ ల్యాబ్‌ను స్థాపించాలని సూచించారు.
అలాగే, విక్రమ్ సోలార్ చైర్మన్ జ్జానేష్ చౌదరి, సీఈఓ అరుణ్ మిట్టల్‌తో సమావేశమై రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. "రాబోయే ఐదేళ్లలో 78.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడం, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడం మా ధ్యేయం" అని ఆయన వివరించారు. రిలయన్స్, ఎస్ఏఈఎల్ వంటి సంస్థలు ఇప్పటికే రాయలసీమలో భారీ సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలకు ఆహ్వానం
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం నేపథ్యంలో ఉక్కు, నిర్మాణ సామగ్రికి భారీ డిమాండ్ ఏర్పడిందని లోకేశ్ తెలిపారు. శ్యామ్ మెటాలిక్స్, సూపర్ స్మెల్టర్స్, రష్మీ మెటాలిక్స్ సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై, ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. కృష్ణపట్నం, గంగవరం, విశాఖ ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్లలో ఉన్న అనుకూలతలను ఆయన గుర్తుచేశారు.
శ్యామ్ మెటాలిక్స్ సంస్థ ఈవీ-గ్రేడ్ అల్యూమినియం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, సూపర్ స్మెల్టర్స్ సంస్థ విజయనగరంలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని 2 ఎంటీపీఏకు విస్తరించాలని కోరారు. కార్మికుల నైపుణ్యాభివృద్ధికి ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రష్మీ మెటాలిక్స్ సంస్థ విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్, డక్టైల్ ఐరన్ పైపుల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని ప్రతిపాదించారు.
ఆగ్రో, హాస్పిటాలిటీ రంగాలపై ఐటీసీకి ప్రతిపాదనలు
ప్రముఖ సంస్థ ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరితో భేటీ అయిన లోకేశ్, రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, హాస్పిటాలిటీ రంగాలపై దృష్టి సారించాలని కోరారు.
"ఆంధ్రప్రదేశ్‌తో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టాలి. వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాల సృష్టిలో మాతో కలిసి పనిచేయాలి" అని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సంజీవ్ పూరి, ఏపీలో తమ సంస్థకు ఇప్పటికే బలమైన కార్యకలాపాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన కంపెనీల ప్రతినిధులు కూడా ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి లోకేశ్ కు తెలిపారు.



