వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి బెయిల్ మంజూరు
- గండిపేటలో భూమి కబ్జా చేసిన కేసు
- మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
హైదరాబాద్ శివారు గండిపేటలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా, ఫేక్ జీవో కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు మూడు రోజుల పాటు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగిసిన అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది.
విచారణ సమయంలో, బ్రహ్మనాయుడు కస్టడీలో ఏ ప్రశ్నకు సరైన సమాధానాలు చెప్పలేదని, దర్యాప్తునకు ఆశించిన స్థాయిలో సహకరించలేదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, కస్టడీ గడువు ముగిసినందున ఆయన బెయిల్‌కు అర్హుడేనని బొల్లా న్యాయవాదులు వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని ఆదేశించింది. అలాగే, ప్రతి 15 రోజులకు ఒకసారి నార్సింగి పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని, కేసు విచారణను లేదా సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని కోర్టు స్పష్టమైన షరతులు విధించింది.