బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి.. మాకు ఇగోలు లేవు: కోల్‌కతాలో నారా లోకేశ్

  • కోల్‌కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో లోకేశ్ కీలక ప్రసంగం
  • స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాలతో ఏపీ ముందుకు వెళ్తోందని వెల్లడి
  • రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం
  • సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని వివరణ
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మించగలవని, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు ప్రధాన సూత్రాలను ప్రత్యేకతలుగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని, ఈ అభివృద్ధి ప్రయాణంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కోల్‌కతాలోని ఐటీసీ సోనార్ హోటల్‌లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో లోకేశ్ తన ప్రసంగంతో పెట్టుబడిదారులను ఆకట్టుకున్నారు.

బెంగాల్ స్ఫూర్తి.. రాష్ట్రాల మధ్య పోటీ అవసరం
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "ఈ రోజు బెంగాల్ ఏది ఆలోచిస్తుందో, రేపు భారత్ అదే ఆలోచిస్తుందని చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాను. భారతదేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక ప్రయాణానికి కోల్‌కతాయే రాజధానిగా నేను భావిస్తాను. బలమైన బెంగాల్ అంటే బలమైన భారతదేశం అని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని అన్నారు. 

అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రితో సమావేశమైన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, అభివృద్ధి పట్ల ఆమె అంకితభావం తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే దేశం పురోగమిస్తుందని, అదే సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని తమ బలాలను పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. భూమి అనేది భారతీయులకు భావోద్వేగంతో కూడిన అంశమైనప్పటికీ, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులను ఎలా ఒప్పించగలిగామో పశ్చిమబెంగాల్ సీఎంకు వివరించినట్లు తెలిపారు.

ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. మూడు ‘ఎస్’ ల మంత్రం

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం స్థిరత్వంతో ముందుకు సాగుతోందని, ఆయన అమలు చేస్తున్న సంస్కరణలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడులలో 25 శాతం ఏపీకే వస్తున్నాయని గుర్తుచేశారు. 

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విజయానికి మూడు ‘ఎస్’లే (SSS) కారణమని వివరించారు. మొదటిది 'స్పీడ్' (వేగం) అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దశను దాటి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అమలు చేస్తున్నామని తెలిపారు. 13 నెలల్లోనే గూగుల్ వంటి అతిపెద్ద విదేశీ పెట్టుబడిని సాధించడం, ఒకే జూమ్ కాల్‌తో ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును ఖరారు చేయడం, పుట్టపర్తిలో 37 రోజుల్లో 600 ఎకరాలు సేకరించి శంకుస్థాపన చేయడం తమ వేగానికి నిదర్శనమన్నారు.

రెండోది 'స్టెబిలిటీ' (స్థిరత్వం) అని, విధానాల్లో స్థిరత్వాన్ని కొనసాగిస్తూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. మూడోది 'సర్వీస్' (సేవ) అని, ప్రభుత్వాలను నియంత్రణ సంస్థలుగా కాకుండా సేవలందించే భాగస్వాములుగా తాము భావిస్తామన్నారు. "కస్టమర్ ఈజ్ గాడ్ అనే మార్వాడీల స్ఫూర్తితో మీకు సేవ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మీరు మా కస్టమర్లు" అని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి అన్నారు.

మాకు ఎలాంటి ఇగోలు లేవు

2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ట్రాక్ రికార్డు, ఆయన దార్శనికతతో ఇది సాధ్యమవుతుందన్నారు. జులైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నామని, మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ నిర్మిస్తామని ప్రకటించారు. 

ఏపీలో యువశక్తితో కూడిన కొత్త కేబినెట్ ఉందని, తామంతా ఎలాంటి ఇగోలు లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కసితో పనిచేస్తున్నామని అన్నారు. "నేను మీకు కేవలం ఒక వాట్సాప్ దూరంలోనే ఉన్నాను. మీ ప్రాజెక్టును మా ప్రాజెక్టుగా భావించి పూర్తిచేస్తాం. మనమంతా కలిసి పనిచేసి, బలమైన రాష్ట్రాల ద్వారా బలమైన భారతదేశాన్ని నిర్మిద్దాం" అని లోకేశ్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ అగర్వాల్, ఉపాధ్యక్షుడు కేశవ్ భజంక, ఇతర ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Nara Lokesh
Indian Chamber of Commerce
Andhra Pradesh Investment Opportunities
Speed Stability Service SSS
Kolkata ICC Plenary Meeting
AP Economic Vision 2047

More Telugu News