తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం వేట.. తాలిపేరును స్వాధీనంలోకి తీసుకున్న బలగాలు

  • ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి చొరబడేందుకు మావోలు యత్నిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం
  • తాలిపేరు ప్రాజెక్టు పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రత్యేక బలగాలు
  • అడవుల్లోనే ఉండిపోయిన అగ్రనేతలే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్

దట్టమైన ఏజెన్సీ అడవులు మరోసారి తుపాకుల మోతకు, బూట్ల చప్పుళ్లకు రెడీ అవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి భారీ సంఖ్యలో మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల గుండా తెలంగాణలోకి చొరబడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అటు ఛత్తీస్‌గఢ్, ఇటు తెలంగాణ సరిహద్దుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ చొరబాటు యత్నాలను ప్రాథమిక దశలోనే తుత్తునియలు చేసేందుకు ఇరు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగాలు రంగంలోకి దిగాయి.


మావోయిస్టులు అడవి మార్గాల గుండా మైదాన ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు సరిహద్దులోని అత్యంత కీలకమైన ‘తాలిపేరు’ ప్రాజెక్టును స్పెషల్ ఫోర్సెస్ (ప్రత్యేక బలగాలు) తమ పూర్తి అధీనంలోకి తీసుకున్నాయి. ప్రాజెక్టు పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించి, అడవి గుండా వెళ్లే ప్రతి రహదారిని, చిన్న చిన్న కాలిబాటలను సైతం పోలీసులు పూర్తిగా బ్లాక్ చేశారు. అనుమానాస్పదంగా రాకపోకలు సాగించే ప్రతీ ఒక్కరిని జల్లెడ పడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ప్రకటించిన పునరావాస ప్యాకేజీలను తిరస్కరించి, ఇంకా అడవుల్లోనే ఉండిపోయిన అగ్రనేతలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతున్నట్లు సమాచారం.


గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి, ప్రస్తుతం లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్న పాత సానుభూతిపరుల కదలికలను కూడా ఇంటెలిజెన్స్ నిశితంగా గమనిస్తోంది. అడవుల్లో ఉన్న యాక్షన్ టీమ్స్‌కు క్షేత్రస్థాయి నుంచి రసాయనిక సామాగ్రి, ఆహార సరుకులు లేదా అంతర్గత సమాచారం లాంటి లాజిస్టిక్ సపోర్ట్ ఏమైనా అందుతోందా అనే కోణంలో పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తున్నారు.


తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో అత్యాధునిక ఆయుధాలతో రంగంలోకి దిగిన ఇరు రాష్ట్రాల ప్రత్యేక బలగాలు సంయుక్తంగా ఏజెన్సీ గ్రామాలను చుట్టుముట్టి భారీ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి తుపాకీ గర్జన వినబడుతుందో తెలియని సందిగ్ధావస్థతో ప్రస్తుతం సరిహద్దు ఏజెన్సీ గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి.


Maoists
Telangana Chhattisgarh Border
Taliperu Project
Bhadradri Kothagudem
Police Combing Operation
Anti Naxal Operation

More Telugu News