ఇంటర్‌తో చదువు ఆపేస్తేనే మంచిదా? ప్రముఖ ఇన్వెస్టర్ కీలక వ్యాఖ్యలు
- భారత విద్యా వ్యవస్థలోని లోపాలపై సౌరభ్ ముఖర్జియా విమర్శలు
- 100 మంది గ్రాడ్యుయేట్లలో ముగ్గురికే అదే ఏడాది ఉద్యోగం వస్తోందని వెల్లడి
- డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యం ఉందని వ్యాఖ్య
- మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కాలేజీల్లో అందడం లేదని విశ్లేషణ
- సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం విద్యార్థుల్లో పెరగాలని సూచన
ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన భారత విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికీ విద్యార్థులకు పాఠాలు బట్టీ పట్టించడం తప్ప ఆలోచించడం నేర్పించడం లేదన్నారు. పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడంపైనే మొత్తం వ్యవస్థ నడుస్తోందని చెప్పారు. ఉద్యోగాల గణాంకాలు చూస్తే పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. కాలేజీల నుంచి బయటకు వచ్చే ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం ముగ్గురికే అదే ఏడాది ఉద్యోగం దొరుకుతోందని పేర్కొన్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 30 శాతం నుంచి 40 శాతం మధ్య ఉంటోందని చెప్పారు.
డిగ్రీ ఉంటే మంచి ఉద్యోగం వస్తుందన్న నమ్మకం క్రమంగా బలహీనపడుతోందని సౌరభ్ అభిప్రాయపడ్డారు. మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కాలేజీల్లో అందడం లేదని అన్నారు. ముంబయిలో నిర్మాణ రంగంలో పనిచేసే ఓ కార్మికుడి ఆదాయం చాలామంది గ్రాడ్యుయేట్ల కంటే ఎక్కువగా ఉంటోందని ఉదాహరించారు. జేసీబీ ఆపరేటర్లు కూడా మంచి వేతనాలు పొందుతున్నారని చెప్పారు. ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడటం కంటే చేతిలో ఓ నైపుణ్యం ఉండటం ఇప్పుడు ఎక్కువ విలువైనదని వ్యాఖ్యానించారు.
కృత్రిమ మేధ, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్నాలజీ వంటి రంగాలు వేగంగా ఎదుగుతున్న సమయంలో విద్యా వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తకాల్లో ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోవడం కంటే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం విద్యార్థుల్లో పెరగాలని సూచించారు. సౌరభ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. డిగ్రీల విలువ తగ్గిందా? లేక విద్యా వ్యవస్థ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారలేకపోతోందా? అన్న చర్చ నడుస్తోంది.