ఏపీ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి.. పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపు
- కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేశ్ భేటీ
- ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను వివరించిన లోకేశ్
- రాష్ట్రాన్ని పారిశ్రామిక, తయారీ హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి
- ఏపీ ప్రభుత్వ చురుకైన విధానాలను అభినందించిన పారిశ్రామికవేత్తలు
- రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి
కోల్‌కతాలో వీసా స్టీల్ వైస్ చైర్మన్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయని ప్రశంసించారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం వ్యూహాత్మక విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఎదుగుతోందని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఉన్న విస్తారమైన తీరప్రాంతం, ప్రపంచ స్థాయి ఓడరేవులు, మెరుగైన లాజిస్టిక్స్, పరిశ్రమలకు అవసరమైన భూమి, నిరంతర విద్యుత్ లభ్యత వంటి అంశాలు పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ పాలసీలు పరిశ్రమల స్థాపనను సులభతరం చేస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటైన 'ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్' ప్లాంట్ పనులు అనకాపల్లి వద్ద ఇప్పటికే ప్రారంభమయ్యాయని, దీంతో రాష్ట్రం ఉక్కు పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మారుతోందని ఉదహరించారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు జాతీయ ఆర్థిక ధోరణులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ-పరిశ్రమల సహకారం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని వారు అభినందించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న లోకేశ్ విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.



