తినాలని ఉన్నా తినలేని స్థితిని అనుభవించా: సమంత

  • తాను కావాలని సన్నబడలేదన్న సమంత
  • మయోసైటిస్ బారిన పడటం వల్లే బరువు తగ్గానని వెల్లడి
  • గతంతో పోలిస్తే ఇప్పుడు తన ఆరోగ్యం కుదుటపడిందన్న సామ్

సెలబ్రిటీల శారీరక ఆకృతి, బరువుకు సంబంధించి సోషల్ మీడియాలో నిరంతరం సాగే చర్చలపై ప్రముఖ కథానాయిక సమంత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తను సన్నబడటంపై నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. తాను కావాలని ఎలాంటి డైటింగ్ చేయలేదని, తీవ్రమైన ‘మయోసైటిస్’ (కండరాల వాపు వ్యాధి) బారిన పడటం వల్లే తన బరువు తగ్గాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా సులభంగా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.


ఆహార నియమాలపై స్పష్టత
తన తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. "గతంతో పోలిస్తే ఇప్పుడు నా ఆరోగ్యం కుదుటపడింది. కావాల్సిన ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాను. అయితే, అతిగా తింటే మయోసైటిస్‌పై ప్రభావం పడుతుందన్న వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం మితంగానే తింటున్నాను. తీవ్ర అనారోగ్య పరిస్థితుల కారణంగా నాకు తినాలని ఉన్నా తినలేని నిస్సహాయ స్థితిని అనుభవించాను. అంతే తప్ప, అందం కోసం డైటింగ్ చేసి బరువు తగ్గలేదు" అని చెప్పారు.


తన పెంపుడు పిల్లికి ‘జెలాటో’ (ఒక రకమైన ఐస్‌క్రీమ్) అని పేరు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని సామ్ వివరించారు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి ఉప్పు, కారం లేని పరిమిత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ కఠినమైన రోజుల్లో కోలుకున్న తర్వాత వైద్యులు మొదటిసారిగా ‘చక్కెర లేని జెలాటో ఐస్‌క్రీమ్’ తినడానికి అనుమతించారని, ఆ జ్ఞాపకార్థమే తన పిల్లికి ఆ పేరు పెట్టినట్లు తెలిపారు.


ఇదిలా ఉండగా, సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 

Go Back to Shorts

More Telugu News