రూ.70 వేల ఉద్యోగం పోయిన రోజే.. లక్షన్నర వేతనంతో ఊహించని ఆఫర్!
- ఉద్యోగం కోల్పోయిన రోజే కొత్త ఆఫర్
- రూ.70 వేల నుంచి రూ.1.58 లక్షలకు పెరిగిన జీతం
- విదేశీ కంపెనీలో... అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
ఒకే ప్రొడక్ట్ ఆధారిత కంపెనీలో నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్న సదరు భారతీయ ఉద్యోగి నెలవారీ వేతనం రూ. 70,000. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఇటీవల అతడిని విధుల్లో నుంచి తొలగించారు. ఈ పరిణామంతో తీవ్ర నిరాశలో ఉన్న అతడికి, అదే రోజు విదేశీ సంస్థ నుంచి ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్ వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ కొత్త ఉద్యోగంలో నెలకు రూ. 1.58 లక్షల వేతనం లభించనుంది. ఇది పూర్తిస్థాయిలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' అవకాశం కావడంతో ప్రయాణ ఖర్చులు సైతం ఆదా కానున్నాయి.
ఈ అనుభవాన్ని అతడు 'శాలరీ హైక్ నన్ను షాక్‌కు గురిచేసింది' అనే శీర్షికతో రెడిట్ వేదికగా పంచుకున్నాడు. "ఇంత భారీ వేతనం లభిస్తుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలు ఇది నిజమేనా అనే సందేహం కలుగుతోంది. ఒకే సంస్థలో తక్కువ జీతానికి సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల మన విలువ ఇంతేనని భ్రమ పడతామా?" అంటూ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.