పాకిస్థాన్‌లో అంతా ఐఎస్ఐ పెత్తనమే.. చట్టసభ నిర్ణయాలను ప్రభావితం చేశారు: పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
- ఐఎస్ఐ గుప్పిట్లోనే పాక్ చట్ట సభలు నడిచాయన్న ఖవాజా ఆసిఫ్
- ఇమ్రాన్ ఖాన్ పాలనలోనే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్య
- ఏకంగా స్పీకర్ నివాసంలో అధికారిక సమావేశాల్లో పాల్గొనేవారని వెల్లడి
పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పాలన అనేది కేవలం ఒక ప్రహసనమని.. అక్కడ తెరవెనుక అంతా సైన్యం, నిఘా సంస్థల మాటే నడుస్తుందని అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుంచో చెబుతున్న పచ్చి నిజం. ఇప్పుడు అదే నిజాన్ని స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రే పార్లమెంట్ వేదికగా అంగీకరించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పాక్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ గుప్పిట్లోనే ఆ దేశ చట్ట సభలు నడిచాయంటూ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నేరుగా జాతీయ అసెంబ్లీలోనే బాంబు పేల్చారు.
పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ... మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనలోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. నాడు ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న జనరల్ ఫైజ్ హమీద్‌కు ఇమ్రాన్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని... ఆయన ఏకంగా నాటి స్పీకర్ నివాసంలో జరిగిన అధికారిక సమావేశాల్లో పాల్గొని చట్టసభ కార్యకలాపాలను, కీలక నిర్ణయాలను శాసించారని వెల్లడించారు.
ఐఎస్ఐ ఒత్తిళ్ల కారణంగానే చట్టసభలో కొన్ని కీలక మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా యాంటీ మనీలాండరింగ్ చట్ట సవరణ పూర్తిగా నిఘా సంస్థకు అనుకూలంగా, వారి ఆదేశాల మేరకే అమల్లోకి తెచ్చారని సంచలన నిజాలు బయటపెట్టారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ కాలంలో ఐఎస్ఐ పెత్తనాన్ని తప్పుబట్టిన ఖవాజా ఆసిఫ్... తమ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం సైన్యంతో కలిసి ‘హైబ్రిడ్’ విధానంలో నడుస్తోందని సమర్థించుకున్నారు. ప్రస్తుతం తమ దేశంలో పౌర-సైనిక హైబ్రిడ్ పాలనా విధానం అమలవుతోందని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొనడం గమనార్హం. అంటే.. పేరుకు ప్రజా ప్రభుత్వం ఉన్నా, ఆర్మీ సపోర్ట్ లేనిదే తాము కూడా ఏమీ చేయలేమని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది.