యుద్ధానికి బ్రేక్.. చారిత్రాత్మక ఒప్పందంపై ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడి సంతకాలు!
- అమెరికా - ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఎంవోయూ
- తాత్కాలికంగా ముగిసిన సుదీర్ఘ సైనిక ఉద్రిక్తతలు
- హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, పన్నుల రద్దు
- ఇరాన్ అణ్వాయుధ సంపత్తి తగ్గింపునకు అంగీకారం
- పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వం సక్సెస్
మొత్తం 14 కీలక పాయింట్లతో కూడిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. ఇరు దేశాల ఘర్షణల వల్ల మూతపడిన వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) ఎలాంటి టోల్ ట్యాక్స్ లేకుండా తక్షణమే పునరుద్ధరించడానికి ఇరాన్ అంగీకరించింది. దీనికి ప్రతిఫలంగా ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను సడలించి, వారి చమురు, ఇంధన ఎగుమతులకు అమెరికా అనుమతి ఇవ్వనుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయబోమని, కొనుగోలు చేయబోమని ఈ ఒప్పందంలో హామీ ఇచ్చింది.
కొన్ని నెలలుగా అమెరికా నావికా దళం విధించిన దిగ్బంధనం కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాల్లో మునిగిపోయిన ఇరాన్‌ను శాంతి మార్గంలోకి తీసుకురావడానికి పాకిస్థాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఈ తాత్కాలిక ఒప్పందం వార్త బయటకు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో తమ జాతీయ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ డీల్ కుదుర్చుకున్నామని ఇరాన్ మీడియా పేర్కొంది. కాగా, ఈ 60 రోజుల ఒప్పంద నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తే తిరిగి సైనిక చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని శుక్రవారం స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాల వేడుక జరగనుంది.