అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
- తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు.
- ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచన
- జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలన్న సీఎం
- దేవాదాయ శాఖ పనితీరు మరింత మెరుగవ్వాలన్న చంద్రబాబు
- పరిపాలనలో సింగపూర్ దేశం వినూత్న విధానాలను అవలంభిస్తోందన్న సీఎం
- డేటా డ్రివెన్ గవర్నెన్సులో గూగుల్ మనతో కలిసి పని చేయడానికి అంగీకరించిందన్న సీఎం
దేవాదాయ శాఖ పనితీరు మరింత మెరుగుపడాలి...
“దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ శాఖ ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపడాలి. అన్ని శాఖల్లోని ఉద్యోగుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణ ఇప్పించాలి. పరిపాలనలో సింగపూర్ దేశం అనుసరిస్తున్న వినూత్న విధానాలను పరిశీలించాలి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో గుర్తించిన 11,600 గుంతల్లో ఇప్పటికే 79 శాతం పూడ్చివేశాం. మిగిలిన రహదారుల మరమ్మతులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ముఖ్యంగా పట్టణ-గ్రామీణ అనుసంధాన రహదారుల మరమ్మతులపై దృష్టి సారించాలి. రహదారుల నిర్మాణం, మరమ్మతుల విషయంలో ఆర్ అండ్ బి, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేయాలి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
పాలనలో సాంకేతికతకు ప్రాధాన్యం.. గూగుల్‌తో భాగస్వామ్యం
“డేటా డ్రివెన్ గవర్నెన్స్‌లో భాగంగా గూగుల్ సంస్థ మనతో కలిసి పనిచేసేందుకు అంగీకరించింది. వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది. ఇదే విధానాన్ని మిగిలిన శాఖల్లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా ప్రజలు అందించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి. అర్జీదారులు తమ ఫిర్యాదుల స్థితిగతులను స్వయంగా ట్రాక్ చేసుకునే అవకాశం కల్పించాలి. తామిచ్చిన ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఎలా పరిష్కారమవుతోంది అనే అంశం అర్జీదారులకు స్పష్టంగా అర్థమయ్యేలా ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి” అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.