ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌తో లింకులున్న ఏడుగురి అరెస్ట్
- ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రముఠా గుట్టురట్టు
- ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన స్పెషల్ సెల్ పోలీసులు
- పాక్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా
- మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉగ్రవాదుల కుట్ర
పంజాబ్ సరిహద్దుల మీదుగా పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను ఈ ముఠా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రాజధానిలోని రద్దీ ప్రదేశాలు, కీలక సంస్థలు, మత పెద్దల నివాసాల వద్ద వీరు రెక్కీ నిర్వహించి, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్లకు పంపినట్లు విచారణలో తేలింది. ఢిల్లీలో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పన్నిన ఓ భారీ కుట్రను ఈ అరెస్టులతో అడ్డుకున్నామని అధికారులు తెలిపారు.
అరెస్టయిన వారిలో అనాస్ త్యాగి, మోహిత్ అలియాస్ యోగి, ఆరిఫ్ అలియాస్ ప్రధాన్, దీపక్ అగ్రోలా, ఆరిఫ్, కరణ్‌వీర్ సింగ్, జతన్, సబీర్ ఉన్నారు. వీరిలో చాలామందికి నేర చరిత్ర ఉంది. నిందితుల నుంచి 5 సె.మీ. ఆటోమేటిక్ పిస్టళ్లు, 41 సజీవ తూటాలు, పాక్ హ్యాండ్లర్లతో జరిపిన సంభాషణలు ఉన్న 7 మొబైల్ ఫోన్లు, ఒక స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్‌కు చేరిన ఆయుధాలను, అక్కడి నుంచి వారు ఢిల్లీకి తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
గత మే నెలలో అందిన నిఘా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. టెక్నికల్ సర్వైలెన్స్, మొబైల్ డేటా విశ్లేషణ ద్వారా ఈ నెట్‌వర్క్‌పై నిశితంగా నిఘా పెట్టిన అధికారులు, మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.