తీరప్రాంత నగరాల రక్షణకు 'రైజప్'.. యూఎన్ హాబిటాట్‌కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన
- సింగపూర్‌లో యూఎన్ హాబిటాట్ డైరెక్టర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- రాష్ట్రంలో యూఎన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదన
- తీరప్రాంత నగరాల రక్షణ, మురికివాడల అభివృద్ధిపై చర్చ
- సీఎం ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన యూఎన్ ప్రతినిధులు
వాతావరణ మార్పుల నుంచి తీరప్రాంత నగరాలను కాపాడేందుకు ఉద్దేశించిన ‘రైజప్’ కార్యక్రమాన్ని ఏపీలో అమలు చేయాలని సీఎం సూచించారు. పట్టణాల్లో మురికివాడల అభివృద్ధికి పార్టిసిపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రాం (పీఎస్‌యూపీ), వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అర్బన్ రాస్తా ఫ్రేమ్‌వర్క్‌ను సంయుక్తంగా అమలు చేయడంపై చర్చించారు. 2028 నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా ఒక టైమ్‌లైన్‌తో కూడిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాలని చంద్రబాబు అన్నారు.
మున్సిపల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ వంటి పద్ధతుల ద్వారా స్థానిక ఆదాయ వనరులను పెంచడం, అంతర్జాతీయ వాతావరణ నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలపై యూఎన్ హాబిటాట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఏపీతో సంపూర్ణ భాగస్వామ్యానికి వారు సుముఖత వ్యక్తం చేశారు.