ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ
- సొంతూరుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ
- 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్
- విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ
- కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న, ఎమ్మెల్యే వంశీకృష్ణ
- తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే తన కల అని చెప్పిన విజయ్
ఇటీవల తన వివాహం అనంతరం సొంత గ్రామమైన తుమ్మన్‌పేటలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో విజయ్ ఈ హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, "ఎంత ఎత్తుకు ఎదిగినా విజయ్ దేవరకొండ తన సొంత ఊరును మర్చిపోకపోవడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఏటా కొనసాగిస్తామని చెప్పడం సంతోషకరం" అని అన్నారు. విజయ్ ఇండస్ట్రీలో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ, "ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మంచి పని చేయాలనుకున్నప్పుడు, మొదట మామయ్య పుట్టిన ఊరి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. మీరంతా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా చేశారు. జీవితంలో గెలుపోటములు సహజం, కానీ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించి గొప్ప స్థాయికి ఎదగాలి" అని విద్యార్థులకు సూచించారు.
విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ, "పిల్లల ఫీజులు చెల్లించడం ఎంత కష్టమో మాకు తెలుసు. పిల్లలు తమ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో, తల్లిదండ్రులు కూడా పిల్లల కలలను నిజం చేసేందుకు ప్రోత్సహించాలి. డ్యూటీ, డిసిప్లెయిన్, డివోషన్, డెడికేషన్, డిటెర్మినేషన్ అనే ఐదు 'డి'లు పాటిస్తే జీవితంలో విజయం తథ్యం" అని పేర్కొన్నారు.
అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "మీ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికే ఈ కార్యక్రమం చేపట్టాం. మార్కుల కన్నా, వాటిని సాధించడానికి మీరు పడిన శ్రమ, ఏకాగ్రత చాలా గొప్పవి. జీవితంలో ఫోకస్, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. నేను, రష్మిక మా స్టూడెంట్ లైఫ్‌లో ర్యాంకర్స్ కాదు. కానీ మీ విజయాన్ని చూసి గర్వపడుతున్నాం. ఈసారి ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఈ ఘనత ఉపాధ్యాయులదే" అని అన్నారు.
"మా తల్లిదండ్రులు ఈ ఊరితో పెంచుకున్న అనుబంధం వల్లే నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఇప్పుడు అచ్చంపేటలో ప్రారంభించాం. భవిష్యత్తులో నాగర్‌కర్నూల్ జిల్లా, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించాలనేది నా కల. ఈ ఉపకార వేతనాలు నిజమైన అర్హులకు మాత్రమే చేరేలా చూడాలని విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను కోరుతున్నాను. ఇది దుర్వినియోగం అయితే నేను చాలా బాధపడతా" అని స్పష్టం చేశారు. కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
