అమరావతిలో బాలయ్య-కొరటాల సినిమా లాంచ్.. ముహూర్తానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు!
- అమరావతిలో ఘనంగా జరగనున్న బాలయ్య కొత్త సినిమా పూజా కార్యక్రమాలు
- జూన్ 25న వెంకటాయపాలెం టీటీడీ ఆలయంలో ముహూర్తం
- ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్
- ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- హాజరుకానున్న నారా, నందమూరి కుటుంబాలు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం సినీ వేడుకలా కాకుండా, ఒక పండుగ వాతావరణంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించే ఈ చిత్ర ముహూర్తపు షాట్‌కు సీఎం చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టనుండగా, మంత్రి నారా లోకేశ్ చిత్ర దర్శకుడు కొరటాల శివకు స్క్రిప్ట్‌ను అందజేస్తారని తెలుస్తోంది. ఈ వేడుకలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొననుండటంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
సాధారణంగా తన సినిమాల్లో బలమైన సామాజిక సందేశాన్ని వాణిజ్య అంశాలతో జోడించి చెప్పడంలో కొరటాల శివ దిట్ట. ఈసారి బాలకృష్ణ ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ పొలిటికల్, హై-వోల్టేజ్ సోషల్ డ్రామా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య సరసన నటించే కథానాయిక, ఇతర కీలక నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ముహూర్తం రోజైన జూన్ 25న అధికారికంగా వెల్లడించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. రాజధాని నడిబొడ్డున జరుగుతున్న ఈ వేడుకపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.