జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ మీడియా అధికారిక ప్రకటన!

Ali Khamenei funeral from July 4 Iran media official announcement
  • జులై 4-5 తేదీలలో టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ ముసల్లాలో వీడ్కోలు సభలు 
  • ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడుల్లో ఖమేనీ మృతి 
  • జులై 9న మషద్‌లో ఖమేనీ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు 
ఇరాన్ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల అధికారిక షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల (జులై) 4వ తేదీ నుంచి రాజధాని టెహ్రాన్‌లో ఈ అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కానుందని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఖమేనీ సంస్మరణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ప్రధాన కమిటీ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ప్రకటన వివరాల ప్రకారం.. జూలై 4, 5 తేదీలలో టెహ్రాన్‌లోని ప్రసిద్ధ ఇమామ్ ఖమేనీ ముసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ పార్థివ దేహానికి వీడ్కోలు వేడుకలు నిర్వహిస్తారు. అనంతరం జూలై 6, 7 తేదీలలో రాజధాని టెహ్రాన్, పవిత్ర నగరం కోమ్ (Qom) లలో భారీ అంతిమ యాత్రలు (Funeral Processions) సాగుతాయి. 9న దేశ ఈశాన్య ప్రాంతంలోని మషద్ (Mashhad) నగరంలో తుది వీడ్కోలు కార్యక్రమం ముగుస్తుంది. అదే రోజున షియా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఎనిమిదో ఇమామ్ 'ఇమామ్ రెజా' పవిత్ర క్షేత్రంలో ఖమేనీ దేహాన్ని ఖననం చేయనున్నారు. నిజానికి మార్చి నెలలోనే జరగాల్సిన ఈ అంత్యక్రియలు యుద్ధ పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యం
86 ఏళ్ల అలీ ఖమేనీ.. ఫిబ్రవరి 28 న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో మరణించారు. ఈ దాడితో ఇరాన్‌పై ఆయన సాగించిన 36 ఏళ్ల పాలన ముగిసింది. ఖమేనీ మరణం తర్వాత మార్చి మొదటి వారంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవడు, అల్లుడితో పాటు నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
Ali Khamenei
Iran Supreme Leader
Ali Khamenei funeral schedule
Mojtaba Khamenei
Tehran
Iran Israel conflict

More Telugu News