అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్

Satya Kumar Yadav highlights revolutionary changes in Andhra Pradesh health sector
  • అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సత్యకుమార్
  • ప్రజలకు ఉచిత  వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య
  • ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఇదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించారని గుర్తుచేశారు. 


గత రెండేళ్ల కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, భవిష్యత్ ప్రణాళికలను మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి వివరాలను, వారి వైద్య చరిత్రను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఓపీ సేవల నుంచి స్పెషలిస్ట్ వైద్య సేవల వరకు అనేక సంస్కరణలు అమలు చేశామన్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సాంప్రదాయ వైద్య విధానాల నుంచి ‘ప్రెడిక్టివ్ హెల్త్‌కేర్’ విధానంలోకి అడుగుపెట్టామని మంత్రి చెప్పారు. అంటే.. వ్యాధి వచ్చాక వైద్యం చేయడం కంటే, అది రాకముందే గుర్తించేలా వ్యవస్థను మార్చామన్నారు. ప్రజల వద్దకే నేరుగా వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, దీనివల్ల వ్యాధులను ముందే గుర్తించి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే టెలిమెడిసిన్ ద్వారా రోగుల సందేహాలకు నిపుణులైన వైద్యులతో సమాధానాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న మెరుగైన సేవల వల్ల ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం, సంతృప్తి పెరిగాయని.. అందుకే ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని సత్యకుమార్ అన్నారు. తమ ప్రభుత్వ పనితీరుకు ఆసుపత్రుల్లోని గణాంకాలే నిదర్శనమని చెప్పారు. ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని చెబుతూ.. ఈ మార్పునకు సహకరించిన వైద్య సిబ్బందికి, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Go Back to Shorts
Satya Kumar Yadav
Andhra Pradesh Health Ministry
Predictive Healthcare System
Swarnandhra 2047
Andhra Pradesh Regional Development
Chandrababu Naidu

More Telugu News