ఆవు నెయ్యితో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు!

  • ఆవు నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలపై పెరుగుతున్న ఆసక్తి
  • జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు నియంత్రణలో సహాయం
  • విటమిన్ ఏ, బ్యూట్రిక్ యాసిడ్ వంటి పోషకాలతో సంపూర్ణం
  • అధికంగా కాకుండా మితంగా వాడాలంటున్న నిపుణులు
  • గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అధ్యయనాల వెల్లడి
భారతీయ గృహాల్లో, ముఖ్యంగా వంటింట్లో ఆవు నెయ్యికి విశిష్ట స్థానం ఉంది. కేవలం వంటకాలకే పరిమితం కాకుండా, తరతరాలుగా దీనిని సంప్రదాయ వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆవు నెయ్యిలోని ఆరోగ్య ప్రయోజనాలపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. ఆయుర్వేద నిపుణులతో పాటు ఆధునిక శాస్త్రవేత్తలు సైతం నెయ్యి వినియోగం వల్ల కలిగే మేలును విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనం వెలువరించింది.

మితంగా ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల బరువును నియంత్రించవచ్చని, శరీరంలో వాపులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, హృదయ ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్, బ్యూట్రిక్ యాసిడ్, విటమిన్-ఏ వంటి పోషకాలే ఈ విశిష్ట గుణాలకు కారణమని విశ్లేషిస్తున్నారు.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, నెయ్యి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచి, ఆహారంలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలతో సతమతమయ్యే వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అయితే, కేవలం రుచి కోసం తగిన మోతాదులో మాత్రమే వాడాలని, అతిగా వాడటం శ్రేయస్కరం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

నెయ్యిలో ఉండే 'బ్యూట్రేట్' అనే ఫ్యాటీ యాసిడ్ పేగుల ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రయోజనాలన్నీ మితమైన వినియోగంతోనే సాధ్యమని గుర్తించాలి. నెయ్యిలో కొవ్వు శాతం అధికంగా ఉండటం వల్ల అతిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తె అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నెయ్యిని తమ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. మొత్తానికి, మన సంప్రదాయ ఆహారపు అలవాట్లలో అంతర్భాగమైన ఆవు నెయ్యిని పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేసే వరమని చెప్పవచ్చు.

Cow Ghee
Health Benefits
Ayurveda
Weight Loss
Digestion
Nutrition

More Telugu News