తెలంగాణలో 'ఎస్ఐఆర్'... రాజకీయ పార్టీల సహకారం కోరిన సీఈఓ
- ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమావేశం
- జూన్ 25 నుంచి ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించనున్న బీఎల్ఓలు
- జూలై 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా వెల్లడి
- అర్హులైన ప్రతి ఒక్కరినీ చేర్చి, అనర్హులను తొలగించడమే లక్ష్యమన్న సీఈఓ
హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో, జూన్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ విధివిధానాలను వివిధ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఇంటింటి సర్వే, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, జూలై 31న ముసాయిదా జాబితా ప్రచురణ, అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా విడుదల వంటి వివిధ దశల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) జూన్ 25 నుండి జూలై 24 వరకు ఇంటింటి సర్వేను నిర్వహిస్తారు. అనంతరం స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అభ్యంతరాలు, విజ్ఞప్తుల స్వీకరణ ప్రక్రియ అనంతరం, పూర్తిస్థాయి పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 1న తుది జాబితాను విడుదల చేయనున్నట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
గత రెండు దశాబ్దాలలో రాష్ట్రంలో ఇంతటి సమగ్ర స్థాయిలో ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగడం ఇదే మొదటిసారి. నకిలీ ఓట్లు, మరణించిన వారి పేర్లు, చిరునామా మారిన వారిని జాబితా నుంచి తొలగించడంతో పాటు, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడమే ఈ ప్రత్యేక సవరణ ముఖ్య ఉద్దేశం.
నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి విచారణ జరపకుండా ఏ ఒక్కరి పేర్లను జాబితా నుంచి తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని అధికారులు భరోసా ఇచ్చారు. పౌరుల సందేహాల నివృత్తికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.