పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్త ఉద్యమం.. విద్యా మేనిఫెస్టో విడుదల చేయనున్న కాక్రోచ్‌ పార్టీ

Abhijit Dipke launches nationwide protest against exam paper leaks from Pune
  • ప్రకటించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే
  • పుణే నుంచి ఉద్యమం ప్రారంభం కానున్నట్లు వెల్లడి
  • పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలకు డిమాండ్‌
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనన్న దీప్కే
  • జూన్‌ 20న జంతర్‌మంతర్‌లో భారీ ఆందోళన
పరీక్షల నిర్వహణలో అక్రమాలు, పేపర్‌ లీక్‌లు, ఫలితాల జాప్యాలపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ప్రకటించారు. పుణేలోని సావిత్రిభాయి యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ విద్యా మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

రాజ్యాంగ పరిధిలోనే శాంతియుతంగా నిరసనలు చేపడతామని దీప్కే స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడం, పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేయడం, నియామకాలు, ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత పెంచడం, పరీక్షల నిర్వహణ సంస్థల జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు.

పరీక్షల నిర్వహణలో లోపాల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ మేనిఫెస్టోలో ప్రస్తావించామని చెప్పారు. పుణే నుంచి ప్రారంభమయ్యే ఈ ఉద్యమాన్ని దేశంలోని పలు నగరాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. జైపూర్‌, లక్నో, అమృత్‌సర్‌, బెంగళూరు నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత జూన్‌ 20న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారీ ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని దీప్కే స్పష్టం చేశారు. కోటి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే తమ సమస్యలను వినే బదులు ప్రభుత్వం సోషల్‌ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.

యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని దీప్కే కోరారు. తమ సంస్థను తేలిగ్గా తీసుకోకుండా విద్యార్థుల ఆందోళనలకు స్పందించాలని అన్నారు. ఇటీవల పరీక్షలకు సంబంధించిన అంశాలపై సోషల్‌ మీడియాలో తమ సంస్థకు మంచి గుర్తింపు లభించిందని, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం యువత ఆధ్వర్యంలో పనిచేస్తున్న వేదికగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
Go Back to Shorts
Abhijit Dipke
Cockroach Janata Party
Education Manifesto
Exam Paper Leak Protest
Dharmendra Pradhan Resignation
Pune University Protest

More Telugu News