జయం రవి - ఆర్తి విడాకుల వివాదం.. మద్రాస్ హైకోర్టు ఆదేశం!
- పిల్లల స్కూల్ ఫీజులు, నిర్వహణ ఖర్చులకు జయం రవి పైసా కూడా ఇవ్వడం లేదన్న ఆర్తి
- రోజువారీ అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పిటిషన్
- మధ్యంతర భరణంపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలంటూ ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు ఆదేశం
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తిల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. పిల్లల పోషణ, స్కూల్ ఫీజుల చెల్లింపు విషయంలో వీరి మధ్య ఉన్న వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
గత ఏప్రిల్ 2025 నుంచి జయం రవి తన పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులకు పైసా కూడా ఇవ్వడం లేదని ఆర్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనివల్ల పిల్లల చదువుకు, రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అత్యవసర పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. వచ్చే రెండు వారాల్లోగా ఈ ‘మధ్యంతర భరణం’ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి, తగిన ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది.
మరోవైపు, ఈ ఆరోపణలపై జయం రవి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సింగర్ కెనిషా తన నుంచి దూరమవుతున్నట్టు ప్రకటించినప్పటి నుంచి ఆర్తి తనను, తన స్నేహితులను మరింత వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో బంతి మళ్లీ ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి వచ్చింది. ఈ హై-ప్రొఫైల్ సెలబ్రిటీ విడాకుల కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అటు అభిమానులు, ఇటు తమిళ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది.