వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. తప్పిన ముప్పు
- తెల్లవారుజామున మరోసారి లీక్ అయిన ద్రవ ఉక్కు
- ఆ సమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో తప్పిన ముప్పు
- మొన్న జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికుల దుర్మరణం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వరుసగా జరుగుతున్న ఘటనలు కార్మికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన భారీ ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మరువక ముందే.. ఈ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్లాంట్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎస్ఎమ్ఎస్-1 విభాగంలోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ వద్ద లాడిల్ నుండి ద్రవ ఉక్కు ఒక్కసారిగా లీకైంది. అయితే, లీకేజీ జరిగిన సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో మరో పెద్ద ప్రాణ నష్టం, ముప్పు తప్పినట్లయింది.
కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అలాంటి ఘటన పునరావృతం కావడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 8న ఎస్ఎమ్ఎస్-2 విభాగంలో లాడిల్ నుండి ద్రవ ఉక్కు పొంగిపొర్లడం వల్ల 9 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ మరణాల నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు భారీ ఎక్స్గ్రేషియా అందించింది. మృతుల కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.