మంత్రి లోకేష్ ఓఎస్డీకి రెండు స్వర్ణ పతకాలు
- మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ డాక్టర్ వరప్రసాద్‌కు రెండు స్వర్ణ పతకాలు
- ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు ఎస్‌వీ యూనివర్సిటీ పురస్కారం
- డా. మన్మోహన్ సింగ్, ప్రొ. డీఎల్ నారాయణ పేర్లతో ఉన్న పతకాల ప్రదానం
- గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వరప్రసాద్
ఎస్‌వీయూలో జరిగిన 63 నుంచి 68వ ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా డాక్టర్ వరప్రసాద్ ఈ పతకాలను అందుకున్నారు. ఆయనకు 'డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్' తో పాటు 'ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్' లభించాయి. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణపై ఆయన తన పరిశోధన సాగించారు. ఈ విధానాన్ని అటు ప్రభుత్వాలకు, ఇటు పెట్టుబడిదారులకు లాభదాయకంగా మార్చేందుకు అవసరమైన విధానపరమైన మార్పులను తన సిద్ధాంత గ్రంథంలో కూలంకషంగా విశ్లేషించారు.
డాక్టర్ వరప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా సేవలందిస్తూనే, డిప్యూటేషన్‌పై మంత్రి నారా లోకేష్ వద్ద ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) పనిచేసిన ఆయన, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్ రూపకల్పన వంటి అంశాల్లో నిపుణుడిగా పేరుగాంచారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన గణాంకాలపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. తదుపరి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి విధుల్లో చేరడం గమనార్హం.