పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్య: కవితకు, పొన్నం ప్రభాకర్‌కు జనసేన కౌంటర్

Pawan Kalyan Ayya Jagiru comments Janasena counter to Kavitha and Ponnam Prabhakar
  • పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
  • పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జనసేన నేతల ఆరోపణ
  • చిప్పకూడు తిన్నవారు కూడా నీతులు చెబుతున్నారన్న జనసేన నాయకుడు సాగర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు కావాలనే వక్రీకరిస్తున్నారని తెలంగాణ జనసేన నేతలు ఆరోపించారు. 'తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు' అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరని వారు స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవడాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్రాన్ని ఎవరూ సొంత ఆస్తిలా భావించవద్దని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు రాజకీయంగా విస్తరిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్ తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమాన్ని, ప్రజలను అవమానించారని మంత్రులు ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు.. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డల త్యాగాలతో ఏర్పడిన ఈ రాష్ట్రం ఇక్కడి భూమిపుత్రులదేనని బీఆర్ఎస్ నేత కవిత కౌంటర్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేత సాగర్‌తో పాటు పలువురు నాయకులు.. పవన్ మాటలను వక్రీకరించవద్దని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటున్న సమయంలో, ఐక్యతను ప్రోత్సహించే ఉద్దేశంతోనే పవన్ మాట్లాడారని వారు వివరించారు.

తెలంగాణ కచ్చితంగా మన 'అయ్య జాగీరే'నని, ఈ భూమిపుత్రులదేనని పవన్ కల్యాణ్ అన్నారని వారు గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోయేది ఇక్కడి బిడ్డలేనని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్న వారంతా అవినీతిపరులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ అవినీతి చిట్టా చాలా పెద్దదని, మంత్రిగా ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని నిలదీశారు.

"తెలంగాణను మేమే తెచ్చాం" అని చెప్పుకున్న వారి పదేళ్ల పాలనను, "మేమే ఇచ్చాం" అని చెబుతున్న వారి రెండేళ్ల పాలనను ప్రజలు చూస్తున్నారని సాగర్ అన్నారు. తెలంగాణ వాదం అత్యంత పవిత్రమైనదని, కానీ గతంలో తెలంగాణను వ్యతిరేకించిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారు సైతం ఇప్పుడు ఈ వాదాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.

అవినీతి కేసులో తీహార్ జైల్లో చిప్పకూడు తిన్నవారు కూడా ఇప్పుడు నీతులు చెబుతుంటే వినాల్సి వస్తోందని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "అక్కా, తెలంగాణ ఉద్యమంలోకి మీరు ఎప్పుడు వచ్చారు? 2000 సంవత్సరంలో ఉద్యమం ప్రారంభమైనప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఉద్యమంలో విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో, ఇక్కడ డబ్బులు దండుకోవచ్చని అమెరికా నుంచి వచ్చారు" అని తీవ్ర ఆరోపణలు చేశారు. కవితకు ఇప్పుడు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena Party
Ponnam Prabhakar
Kalvakuntla Kavitha
Telangana Politics
Ayya Jagiru Comments

More Telugu News