ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మైఖేల్ క్లార్క్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన అనంతరం అహ్మదాబాద్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తాను స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డానని క్లార్క్‌ స్వయంగా వెల్లడించాడు.

మే 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన క్లార్క్, అనంతరం విమానాశ్రయానికి బయలుదేరాడు. మార్గమధ్యలో తాను నిద్రలోకి జారుకున్నానని, మెలకువ వచ్చేసరికి తన కారు ముందు భాగం ఒక సెమీ ట్రక్కు కింద ఇరుక్కుపోయి ఉందని ఆయన తెలిపాడు. బ్రేక్ లైట్లు పనిచేయని ట్రక్కును తమ కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని క్లార్క్ వివరించాడు. 'బియాండ్ 23 క్రికెట్ పాడ్‌కాస్ట్'లో ఈ వివరాలను పంచుకున్నాడు.

"ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచేసరికి, కారు ముందు భాగం ట్రక్కు కింద ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను" అని క్లార్క్‌ పేర్కొన్నాడు. ఈ ఘటనలో తనకు స్వల్ప గాయాలయ్యాయని, అయితే డ్రైవర్ కాలు విరిగి ఉండవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ కారు ఒక సంస్థకు చెందినది కావడంతో, డ్రైవర్ తీవ్ర భయాందోళనకు లోనయ్యాడని క్లార్క్ తెలిపాడు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయం అందించారని క్లార్క్‌ వెల్లడించాడు. "భారత్‌లో ఉన్న ఉదార స్వభావం గల ప్రజల వల్లే నేను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగాను" అని పేర్కొన్నాడు. తన యోగక్షేమాల గురించి ఆరా తీసిన బీసీసీఐ అధికారులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఆద్యంతం వ్యాఖ్యాతగా వ్యవహరించిన క్లార్క్, ఫైనల్ ముగిసిన కొద్ది గంటలకే ఈ ప్రమాదానికి గురయ్యాడు.