ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు

Pawan Kalyan urges everyone to plant a tree in their mothers name for World Environment Day
  • మూలపాడులోని బటర్ ఫ్లై పార్కులో తెల్ల పొనికి మొక్కను నాటిన పవన్
  • తన తల్లి అంజనా దేవికి అంకితం ఇస్తూ మొక్క నాటిన వైనం
  • 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక వినూత్నమైన, అర్థవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూనే... ఇటు ఒక భావోద్వేగపూరితమైన వ్యక్తిగత స్పర్శతో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు ‘బటర్ ఫ్లై పార్క్’ (సీతాకోకచిలుకల పార్క్)ను సందర్శించిన పవన్ కళ్యాణ్... అక్కడ ఎంతో అరుదైన, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ‘తెల్ల పొనికి’ మొక్కను నాటారు. ప్రపంచప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మల తయారీకి ఈ తెల్ల పొనికి కర్రనే ఉపయోగిస్తారు. ఈ అరుదైన మొక్కను పవన్ కల్యాణ్ తన తల్లి అంజనా దేవికి అంకితం ఇస్తూ నాటడం విశేషం.


ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు. "మనకు జన్మనిచ్చిన తల్లిపై ప్రేమతో, గౌరవంతో ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరిట కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి. మనమంతా కలిసికట్టుగా పచ్చదనాన్ని పెంచి, పర్యావరణాన్ని కాపాడుకుందాం" అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.


2.5 కోట్ల ‘విత్తన బంతుల’ (Seed Balls) భారీ ఉద్యమం!

రాష్ట్రంలో అడవుల శాతాన్ని, పచ్చదనాన్ని భారీగా పెంచే లక్ష్యంతో పవన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఒక భారీ టార్గెట్‌ను నిర్దేశించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.5 కోట్ల విత్తన బంతులను సిద్ధం చేసి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ విత్తన బంతులను అటవీ ప్రాంతాలు, బంజరు భూములు, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో చల్లడం ద్వారా సహజసిద్ధంగా అడవుల పునరుత్పత్తి జరిగేలా ప్లాన్ చేశారు.


భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్నా, పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నా ఇలాంటి హరిత కార్యక్రమాలు అత్యంత కీలకమని పవన్ నొక్కి చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ పచ్చని ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు.

Go Back to Shorts
Pawan Kalyan
World Environment Day
Andhra Pradesh Deputy CM
Plant for Mother Campaign
Vana Mahotsavam
Seed Balls Movement
Tella Poniki Tree
Mulapadu Butterfly Park
Kondapalli Toys
Environment Conservation

More Telugu News