పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం లేదా? ఈ 5 సులువైన టిప్స్‌తో చెక్ పెట్టండి!

  • పస్తులుండటం వల్ల పొట్ట కొవ్వు తగ్గదని డాక్టర్ల సూచన
  • ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండాలి
  • రోజూ నడవడం వల్ల మంచి ఫలితం
  • నిద్రలేమి వల్ల పొట్ట కొవ్వు పెరుగుతుంది
  • మానసిక ఒత్తిడి తగ్గితేనే బరువు తగ్గుతారు
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల డైట్లు, వ్యాయామాలు, సప్లిమెంట్లు వాడుతుంటారు. అయినా సరే ఫలితం లేక విసిగిపోయే వారు చాలా మందే ఉన్నారు. అయితే శరీరంలో ఏదో ఒక భాగంలోనే కొవ్వును తగ్గించడం అనేది అసాధ్యమని.. కానీ సరైన అలవాట్లతో పొట్ట కొవ్వును కరిగించవచ్చని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ మాణిక్యం చెబుతున్నారు. ఇందుకోసం ఇంట్లోనే రోజూ పాటించాల్సిన 5 ముఖ్యమైన నియమాలను వివరించారు.

1. తక్కువ తినాలి: బరువు తగ్గాలనుకునే వారు చేసే అతిపెద్ద పొరపాటు తిండిని పూర్తిగా మానేయడం. ఇలా తిండిని విపరీతంగా తగ్గించడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి పొట్ట కొవ్వు మరింత మొండిగా మారుతుందని డాక్టర్ పాల్ హెచ్చరిస్తున్నారు. కడుపు మాడ్చుకోకుండా తీసుకునే ఆహార పరిమాణాన్ని (క్యాలరీలను) కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది.

2. ప్రొటీన్‌ తీసుకోవాలి: పొట్ట కొవ్వుపై పోరాటంలో ప్రొటీన్ ఒక అద్భుతమైన ఆయుధంగా పనిచేస్తుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా పదే పదే స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గే సమయంలో కండరాల రక్షణకు, రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచడానికి ప్రొటీన్ ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ప్రతి పూట తినే ఆహారంలో ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం మరువద్దు.

3. రోజూ శరీరాన్ని కదిలించాలి: బరువు తగ్గడానికి రోజూ జిమ్‌కు వెళ్లి భారీ వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. రోజూ కాసేపు నడవడం, తేలికపాటి వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వారానికి ఒకసారి ఎప్పుడో ఎక్కువ సమయం వర్కౌట్లు చేయడం కంటే.. రోజూ కాస్తయినా శరీరాన్ని కదిలించడం చాలా ముఖ్యం.

4. నిద్రను అస్సలు తగ్గించవద్దు: బొజ్జ పెరగడానికి నిద్రలేమి కూడా ఒక ప్రధాన కారణం అని వైద్యులు చెబుతున్నారు. నిద్ర సరిపోకపోతే ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలై.. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినాలనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర అసమతుల్యతకు దారితీసి కొవ్వు అంతా పొట్ట భాగంలోనే పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి పొట్ట తగ్గాలనుకునే వారు ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి.

5. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోండి: బరువు తగ్గే ప్రయాణంలో మానసిక ఒత్తిడి అతిపెద్ద శత్రువు లాంటిది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయులు పెరిగి కొవ్వును నేరుగా పొట్ట వైపునకే మళ్లిస్తాయి. అందుకే ధ్యానం, ప్రకృతిలో నడవడం లేదా నచ్చిన హాబీలకు సమయం కేటాయించడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి. రాత్రికి రాత్రే బరువు తగ్గిస్తామనే ప్రకటనలను నమ్మవద్దని డాక్టర్ పాల్ స్పష్టం చేశారు.

belly fat
fitness
Calorie deficit
weight loss
Protein diet
Sleep deprivation
Cortisol

More Telugu News