గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్
- డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు స్పష్టీకరణ
- పేటిఎం బ్యాచ్‌లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- యోగాంధ్ర కార్యక్రమానికి నిధుల కేటాయింపుపై విమర్శలను తప్పుబట్టిన సీఎం
- ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలని రాజకీయ పార్టీలకు పిలుపు
డీఎస్సీ నియామకాలపై వస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందిస్తూ, "డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి టీడీపీ ఒక బ్రాండ్. అధికారంలోకి రాగానే తొలి సంతకంతో పారదర్శకంగా నియామకాలు చేపట్టాం. స్పోర్ట్స్ కోటాపై కనీస అవగాహన లేకుండా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కేటగిరీలు నిర్ణయించి ఉద్యోగాలు ఇచ్చాం" అని వివరించారు. కొందరు తమ పేటిఎం బ్యాచ్‌ల ద్వారా ప్రభుత్వంపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు ఏ అంశంపైనైనా మాట్లాడే ముందు అధ్యయనం చేయాలని హితవు పలికారు. "యోగాంధ్ర కార్యక్రమం కోసం రూ.10 కోట్లు కేటాయిస్తే దానిపైనా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్మాణాత్మక నిర్ణయం తీసుకున్నా బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన జరిగి 12 ఏళ్లు గడిచిపోయిందని, ఈ సమయంలో ప్రజలకు ఎవరు మంచి చేశారో అందరికీ తెలుసని చంద్రబాబు అన్నారు. అనవసర వివాదాలు సృష్టించడం మానుకుని, ప్రజలకు మేలు చేయడంలో రాజకీయ పార్టీలు పోటీ పడాలని ఆయన సూచించారు.