మిస్టరీగా మారిన ఎంబీఏ విద్యార్థిని మిస్సింగ్ కేసు!

MBA Student missing still a mystery
  • ఉత్తరాఖండ్‌లో ట్రెకింగ్‌కు వెళ్లిన ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
  • మే 29 నుంచి కనిపించకుండా పోయిన బబితా పాండే
  • యువతితో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులను విచారిస్తున్న పోలీసులు
  • ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కొనసాగుతున్న భారీ గాలింపు చర్యలు
  • క్యాంప్‌సైట్ సమీపంలోని సరస్సుపై దృష్టి సారించిన సహాయక బృందాలు
ఉత్తరాఖండ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ ఎంబీఏ విద్యార్థిని అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నైనిటాల్ జిల్లాకు చెందిన బబితా పాండే (24) మే 29 నుంచి కనిపించకుండా పోయింది. ఉత్తరకాశీలోని దయ్యార్ బుగ్యాల్ ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆమె, గోయి బేస్ క్యాంప్ వద్ద అదృశ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమెతో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, బబితా పాండే తన స్నేహితులైన హర్మన్ పాల్ సింగ్ (23), హర్మన్‌ప్రీత్ సింగ్ (23) లతో కలిసి మే 25న ట్రెక్కింగ్‌కు బయలుదేరింది. డెహ్రాడూన్, హర్సిల్ సందర్శన అనంతరం మే 28న రైతల్ గ్రామానికి చేరుకున్నారు. మే 29న దయ్యార్ బుగ్యాల్ ట్రెక్కింగ్‌ కోసం గోయి బేస్ క్యాంప్‌కు వెళ్లగా, అక్కడి నుంచే బబితా కనిపించకుండా పోయింది. రైతల్ గ్రామంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఆమె చివరిసారిగా తన స్నేహితులతో కనిపించింది.

బబితా అదృశ్యంపై మే 31న మానేరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అటవీ శాఖ అధికారులు డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లతో అడవులు, లోయల్లో విస్తృతంగా గాలించారు. దాదాపు ఆరు రోజులుగా గాలిస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో తాజాగా అధికారులు క్యాంప్‌సైట్‌కు సమీపంలో ఉన్న ఓ సరస్సుపై దృష్టి సారించారు. ప్రత్యేక పరికరాలతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం సరస్సులో గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ట్రెకింగ్ రిజిస్ట్రేషన్‌లో కూడా కొన్ని అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తుండటంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Babita Pandey
Missing
Trekking
MBA Student
Uttarakhand

More Telugu News