నైట్‌ షిఫ్ట్‌లా? ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ ఉందా?.. అయితే నిద్రను బ్యాలెన్స్‌ చేసుకునే సూపర్‌ టెక్నిక్‌!

If there any work which requires to avoid sleep then prepare a sleep bank
  • ముందే అదనంగా నిద్రపోవడమే 'స్లీప్ బ్యాంకింగ్'
  • దీనివల్ల ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని నిపుణుల వెల్లడి
  • జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయని తేల్చిన రీసెర్చ్‌
  • నిద్రలేమి వల్ల గుండెజబ్బుల ముప్పు
  • రోజుకు 8 గంటలకు పైగా నిద్రపోవాలని నిపుణుల సూచన
ఇంట్లో పెళ్లి వేడుకలు ఉన్నా, ఆఫీసులో అర్జెంట్ ప్రాజెక్ట్ ఉన్నా.. రాబోయే రోజుల్లో నిద్ర కరవవుతుందని ముందే తెలిసిపోతుంది. ఇలాంటి బిజీ షెడ్యూల్స్ వల్ల నిద్ర సరిపోక శరీరం, మనస్సు తీవ్ర అలసటకు గురవుతాయి. అయితే రాబోయే రోజుల్లో నిద్ర తగ్గినా సరే, శరీరం అంతే ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా ఉండటానికి ఆరోగ్య నిపుణులు ఒక సూపర్ టెక్నిక్ చెబుతున్నారు. దాన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు.

ఏంటి ఈ టెక్నిక్?
మనం భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లే.. రాబోయే రోజుల్లో నిద్ర తగ్గుతుందని తెలిసినప్పుడు, ముందే అదనంగా నిద్రపోవడాన్ని స్లీప్ బ్యాంకింగ్ అంటారు. బిజీ షెడ్యూల్స్ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు నుంచే రోజువారీ నిద్ర సమయాన్ని పెంచాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి కారణంగా శరీరంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
నైట్ షిఫ్ట్‌లు చేసే డాక్టర్లపై జరిగిన ఓ పరిశోధనలో స్లీప్ బ్యాంకింగ్ అద్భుతంగా పనిచేస్తుందని తేలింది. నైట్ షిఫ్ట్ ప్రారంభం కావడానికి ఒక వారం ముందు నుంచే రోజుకు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయిన వారు విధుల్లో చాలా చురుగ్గా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పద్ధతి వల్ల బాడీ ఒత్తిడిని తట్టుకోవడమే కాకుండా జ్ఞాపకశక్తి ఏకాగ్రత కూడా బాగా పెరుగుతాయని క్లినికల్ స్లీప్ మెడిసిన్ జర్నల్ వెల్లడించింది.

నిద్ర లేకపోతే వచ్చే నష్టాలు
నిద్రలేమి అంటే కేవలం అలసట మాత్రమే కాదు. దీర్ఘకాలం పాటు సరిగా నిద్రపోకపోతే టైప్-2 డయాబెటిస్, విపరీతంగా బరువు పెరగడం, గుండె జబ్బులు, పక్షవాతం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మంచి నిద్ర శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నిపుణుల ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు కనీసం 7 నుంచి 9 గంటల నిద్రను కోల్పోతున్నారు.

ఇలా ప్లాన్ చేసుకోండి
మీ ఇంట్లో ఏదైనా పెళ్లి లేదా పెద్ద ఫంక్షన్ ఉందనుకుంటే దానికి వారం రోజుల ముందు నుంచే స్లీప్ బ్యాంకింగ్ ప్లాన్ చేసుకోండి. రోజూ సాధారణం కంటే ఒకట్రెండు గంటలు ఎక్కువగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల బాడీలో ఎనర్జీ పెరుగుతుంది. ఆ తర్వాత వేడుకల సమయంలో ఒకట్రెండు రోజులు నిద్ర తగ్గినా సరే మీ ముఖంలో అలసట కనిపించదు. మీరు ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తారు.
Go Back to Shorts
Sleep
Night Shifts
Wedding
Sleeping
Sleep Bank

More Telugu News