భారత్‌కు వచ్చే విదేశీయులకు కొత్త రూల్స్.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు

Centre changes registration rules for foreigners staying beyond 180 days
  • భారత్‌లో విదేశీయుల బసపై కొత్త నిబంధనలు
  • 180 రోజుల గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
  • గతంలో గడువు ముగిశాక 14 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు
  • విదేశీ తల్లిదండ్రులకు పుట్టే పిల్లల విషయంలోనూ నిబంధనల సవరణ
భారత్‌లో 180 రోజులకు మించి బస చేయాలనుకునే విదేశీ పౌరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు ఉన్న విధానానికి భిన్నంగా, ఇకపై 180 రోజుల గడువు ముగియక ముందే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ రూల్స్-2025కు సవరణలు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

గతంలో దేశంలోకి ప్రవేశించిన 180 రోజులు పూర్తయ్యాక, 14 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం 180 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం వీసాపై వచ్చి, తమ బసను పొడిగించుకోవాలనుకునే వారు ఆ గడువు ముగియక ముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అలాగే, 180 రోజులకు మించిన వీసా కలిగి ఉండి, ప్రతి బస ఆ గడువును మించకూడదనే షరతు ఉన్నవారికి కూడా ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గడువు దాటిన తర్వాత రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ సవరణల్లో భాగంగా విదేశీ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల విషయంలోనూ కొన్ని మార్పులు చేశారు. తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులై, తమ బిడ్డకు భారత పౌరసత్వం కొనసాగించాలని కోరుకుంటే, గతంలో ఉన్న 30 రోజుల నోటిఫికేషన్ నిబంధన ఇకపై వర్తించదు. అయితే, ఆ బిడ్డ భారత్‌లో నివసిస్తూనే వేరే దేశ పౌరసత్వం పొందితే, ఆ విషయాన్ని 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలి. వీటితో పాటు విదేశీయులకు వసతి కల్పించే ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల రిపోర్టింగ్ విధానాల్లోనూ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Go Back to Shorts
Foreigners
registration rules
Indian Govt

More Telugu News