ప్రపంచ వాణిజ్యానికి మరో గండం.. కీలక జలసంధిపై ఇరాన్ కన్ను
- లెబనాన్ ఘర్షణల నేపథ్యంలో బాబ్ అల్-మందెబ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరిక
- అమెరికాతో పరోక్ష చర్చలను నిలిపివేసినట్లు ప్రకటించిన టెహ్రాన్
- హౌతీల ద్వారా కీలక వాణిజ్య మార్గాన్ని అడ్డుకుంటామని సంకేతాలు
- ఇరాన్ ప్రకటనతో 4 శాతానికి పైగా పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు
- హర్మూజ్ తరహాలోనే ప్రతిఘటన ఉంటుందన్న ఇరాన్ కమాండర్
జూన్ 1న ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో పరోక్షంగా జరుపుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు, బాబ్ అల్-మందెబ్ సహా పలు మార్గాల్లో ప్రతిఘటనను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేయడంపై ఆలోచిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో పౌరులు, పారామెడిక్స్ మృతికి కారణమైన ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎర్ర సముద్రానికి దక్షిణ ప్రవేశ ద్వారంగా, యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య బాబ్ అల్-మందెబ్ జలసంధి ఉంది. దీనిని 'గేట్ ఆఫ్ టియర్స్' అని కూడా పిలుస్తారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 12-15 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా సూయజ్ కాలువకు వెళ్లే నౌకలకు ఇది అత్యంత కీలకం. ఈ జలసంధిపై ఇరాన్‌కు ప్రత్యక్ష నియంత్రణ లేనప్పటికీ, యెమెన్‌లోని హౌతీల ద్వారా గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది.
లెబనాన్, గాజాలలో ఇజ్రాయెల్ చర్యలు కొనసాగితే, తమ 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' హర్మూజ్ తరహాలోనే బాబ్ అల్-మందెబ్‌లో కూడా నౌకా రవాణాను అడ్డుకుంటామని ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ స్పష్టం చేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జూన్ 1న అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 4 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93 డాలర్లను దాటింది. మరోవైపు, రాబోయే వారంలోగా హర్మూజ్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇరాన్‌తో కొత్త ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.