ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: కవిత

Kavitha Demands Professor Jayashankar Statue at Tank Bund by August 6
  • జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్న కవిత
  • అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్
  • డిమాండ్లను నెరవేర్చకపోతే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరిక

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజైన ఆగస్టు 6వ తేదీ లోపు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తయినప్పటికీ, స్వరాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన వెన్నెముకగా నిలిచిన జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 


ఒకవేళ ప్రభుత్వం ఆగస్టు 6 లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే, కనీసం తమ పార్టీకైనా అనుమతి ఇవ్వాలని, తామే స్వయంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే, స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు, ఉద్యమకారులకు ఆమె ఘన నివాళులర్పించారు.


తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సరైన గుర్తింపు, గౌరవం దక్కాలని ఆమె కోరారు. అలాగే జూలై 2వ తేదీ లోపు అమరవీరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే, తమ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్ వేదికగా ఒక భారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, పెద్ద ఎత్తున వంటా-వార్పు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని తెలిపారు. అమరవీరుల త్యాగాలను మరవకుండా ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించాలని హితవు పలికారు.

Go Back to Shorts
Kavitha
TRS
Jayashankar

More Telugu News