వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే: బీసీ జనార్దన్ రెడ్డి
- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందన్న జనార్దన్ రెడ్డి
- కూటమి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
- వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి, శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, కూటమి కార్యకర్తలు వైసీపీ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా ముదిగేడులో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహంపై దాడి చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్యేనని మంత్రి స్పష్టం చేశారు. తాము వైసీపీ మద్దతుదారులమంటూ అతని భార్య వీడియో విడుదల చేసిందని, స్థానిక వైసీపీ కార్పొరేటర్ శేషయ్యే తమకు ఉద్యోగం ఇప్పించారని ఆమె స్వయంగా అంగీకరించిందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ కుట్రలో తెలుగుదేశం పార్టీని ఇరికించేందుకు వైసీపీ ప్రయత్నించిందని ఆయన మండిపడ్డారు. 1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచే ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారని ఆయన గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయిన ఆ గొడ్డలి పార్టీ నాయకులకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎండగట్టారు.