హైదరాబాద్‌ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్!

  • హైదరాబాద్‌లో జనసేన 'నవనిర్మాణ సభ'
  • తెలంగాణ ఏర్పాటును పవన్ తీవ్రంగా వ్యతిరేకించారన్న పొన్నం
  • హైదరాబాద్‌లోనే పవన్ ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్న

హైదరాబాద్‌లో జనసేన అధినేత, ఏపీ పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’పై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును గతంలో పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారని మంత్రి పొన్నం గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం ముట్టలేదని పవన్ చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ... అసలు ఏ నైతిక హక్కుతో ఆయన హైదరాబాద్‌లో ఇంత పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.


"తెలంగాణ దృష్టి పడితే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతాయి" అంటూ గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, భావాలను తీవ్రంగా గాయపరిచాయని పొన్నం మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై పవన్ సమాధానం చెప్పి తీరాలన్నారు. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ద్వేషాన్ని నింపేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీని వెనుక బీజేపీతో పవన్‌కు ఉన్న ‘తెరవెనుక ఒప్పందం’ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.


ఈ సభ నిజంగా అభివృద్ధి కోసమే అయితే గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు లేదా కేరళలో పెట్టుకోవచ్చు కదా... కేవలం హైదరాబాద్‌లోనే ఎందుకు పెడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. ఏపీ ప్రజలు పవన్‌కు బాధ్యతాయుతమైన పదవి ఇచ్చారని, తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా... వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. పవన్ గనుక క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ ప్రజలు ఈ సభను తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించారు.

Pawan Kalyan
Telangana
Ponnam Prabhakar
Janasena
Hyderabad Sabha
Telangana Formation
Vizag Steel Plant
Andhra Pradesh Politics
BJP
Political Controversy

More Telugu News