ఆన్‌లైన్ ప్రేమ... ప్రియురాలి కోసం ప్రాణాలకు తెగించి భారత్‌కు వచ్చిన పీవోకే యువకుడు
- ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు
- జమ్మూ కశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం
- పీవోకేలోకి వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు సోపోర్ యువకులను అడ్డుకున్న భద్రతా దళాలు
- అరెస్టయిన వారిలో సస్పెండైన టెరిటోరియల్ ఆర్మీ మాజీ సిబ్బంది
- రెండు ఘటనలపై లోతుగా విచారణ జరుపుతున్న భద్రతా ఏజెన్సీలు
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పీవోకేలోని ముజఫరాబాద్‌కు చెందిన జీషాన్ అహ్మద్ మీర్ (22) అనే యువకుడు యూరీ సెక్టార్‌లోని సిలికోట్ ప్రాంతంలో ఎల్వోసీ దాటుతుండగా ఉదయం 9:30 గంటల సమయంలో సైనికులు గమనించారు. వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో తన వద్ద ఉన్న పాకిస్థాన్ గుర్తింపు కార్డును చూపించాడు. యూరీకి చెందిన ఇరమ్ బానో అనే యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆమెను కలిసేందుకే ఇక్కడికి వచ్చానని జీషాన్ తెలిపాడు.
జీషాన్ చెబుతున్న విషయాలను భద్రతా ఏజెన్సీలు నిర్ధారించుకుంటున్నాయి. ప్రస్తుతం జీషాన్‌తో పాటు సదరు యువతిని కూడా అధికారులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్, వారి నేపథ్యంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రేమకథ నిజమేనా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
పీవోకేలోకి వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు అరెస్ట్
ఇదిలా ఉంటే.. నియంత్రణ రేఖ వద్ద మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. హత్‌లంగా-నంబ్లా ప్రాంతంలో ముగ్గురు యువకులు పీవోకేలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సైన్యం వారిని పట్టుకుంది. పట్టుబడిన వారిని సోపోర్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్‌లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ గతంలో టెరిటోరియల్ ఆర్మీ (టీఏ-161)లో పనిచేసి సస్పెండ్ అయినట్లు అధికారులు తెలిపారు. నిఘా సమాచారం ఆధారంగా సైన్యం వీరిని సరిహద్దుకు చేరుకోకముందే అడ్డుకుంది. వారి ఉద్దేశం ఏంటి, ఏదైనా ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా, పూంచ్ వంటి పలు జిల్లాల గుండా సుమారు 740 కిలోమీటర్ల పొడవున నియంత్రణ రేఖ విస్తరించి ఉంది. చొరబాట్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, డ్రోన్ల కార్యకలాపాలను అడ్డుకునేందుకు భద్రతా దళాలు ఎల్వోసీ వెంబడి నిరంతరం గస్తీ కాస్తుంటాయి.