ఇరాన్ రాడార్లు.. డ్రోన్ కంట్రోల్ వ్యవస్థపై అమెరికా భీకరదాడులు

Iran Radar Sites Hit by US Airstrikes After Drone Incident
  • కువైట్ గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్
  • ఇరు దేశాల దాడులతో 2 శాతం పెరిగిన చమురు ధరలు
  • భూగర్భ క్షిపణి టన్నెళ్లను వేగంగా పునరుద్ధరిస్తున్న ఇరాన్
మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ పొడిగింపు కోసం దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేడెక్కాయి. అమెరికా, ఇరాన్ బలగాలు గత వారాంతంలో డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ దూకుడుకు ప్రతిగా 'ఆత్మరక్షణ దాడులు' జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించగా, ఇది తమపై జరిగిన దాడికి ప్రతీకార చర్యేనని ఇరాన్ స్పష్టం చేసింది.

అంతర్జాతీయ జలాల్లో నిఘా పెట్టిన తమ ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా, అమెరికా ఫైటర్ జెట్లు దక్షిణ ఇరాన్‌లోని గోరుక్ ప్రాంతం, క్విష్మ్ ద్వీపంలోని ఇరాన్ రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కంట్రోల్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించినట్లు సెంట్‌కామ్ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన రెండు సూసైడ్ డ్రోన్లను కూడా ధ్వంసం చేశామని, తమ సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది.

అమెరికా దాడులకు ప్రతీకారంగా, సరిక్ ద్వీపంపై దాడిలో పాల్గొన్న ఒక అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. మరోవైపు, తమ గగనతలంలోకి ప్రవేశించిన కొన్ని క్షిపణులను గాల్లోనే విజయవంతంగా నాశనం చేసినట్లు కువైట్ సైన్యం ప్రకటించింది.

ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2 శాతం పెరిగి 93.05 డాలర్లకు చేరింది. ఇదిలావుండగా, గత దాడుల్లో ధ్వంసమైన భూగర్భ క్షిపణి టన్నెళ్లను ఇరాన్ వేగంగా పునరుద్ధరిస్తోందని ‘సీఎన్‌ఎన్’ తన కథనంలో వెల్లడించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా, దెబ్బతిన్న 69 టన్నెల్ ప్రవేశ మార్గాల్లో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ తిరిగి వినియోగంలోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ పరిణామాలు గల్ఫ్ రీజియన్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
Go Back to Shorts
Iran
Iran radar
US airstrikes
MQ-1 drone
Goruq
Qishm Island
IRGC
Kuwait
Brent crude oil
Middle East tensions

More Telugu News