టెక్ మార్కెట్‌లో భారీ బబుల్.. 1999 కంటే పెద్దది.. పరిణామాలు తీవ్రం: జోహో శ్రీధర్ వేంబు

  • ఏఐ ఆధారిత టెక్ కంపెనీల వ్యాల్యుయేషన్లు భారీ బబుల్‌ను తలపిస్తున్నాయన్న‌ శ్రీధర్ వెంబు
  • ప్రస్తుత పరిస్థితి 1999 నాటి డాట్-కామ్ బబుల్ కంటే ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్య‌
  • ఎన్విడియా, యాపిల్ వంటి కంపెనీల ధర-విక్రయాల నిష్పత్తి అసాధారణ స్థాయిలో ఉందని వెల్ల‌డి
  • కంపెనీల ప్రాథమిక వ్యాపారాలకు, మార్కెట్ విలువలకు మధ్య సంబంధం లేకుండా పోయిందని ఆందోళన 
  • ఈ బబుల్ పగిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్ష హెచ్చ‌రిక‌
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు టెక్నాలజీ మార్కెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చుట్టూ అలుముకున్న అంచనాలతో కొన్ని టెక్ కంపెనీల వాల్యుయేషన్లు ఆకాశాన్నంటాయని, ఇది 1999 నాటి డాట్-కామ్ బబుల్‌ను మించిన సంక్షోభానికి దారితీయవచ్చని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏఐపై పెట్టుబడిదారుల ఉత్సాహం మార్కెట్‌లో ఒక భారీ బుడగను సృష్టిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన తన ఆందోళనలను పంచుకున్నారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల 'ధర-విక్రయాల నిష్పత్తి' (ప్రైస్-టు-సేల్స్ రేషియో) విపరీతంగా పెరిగిపోయిందని, కంపెనీల అసలు వ్యాపార పనితీరుకు, వాటి మార్కెట్ విలువకు మధ్య పొంతన లేకుండా పోయిందని విశ్లేషించారు. కొన్ని కంపెనీల వార్షిక ఆదాయానికి కొన్ని రెట్లు అధికంగా వాటి షేర్ల విలువ ఉండటం ప్రమాదకరమని స్పష్టం చేశారు.

ఉదాహరణగా కొన్ని కంపెనీల వివరాలను ఆయన పంచుకున్నారు. ఎన్విడియా షేర్ ధర 20 రెట్లు ఎక్కువగా ఉందని, మైక్రాన్ టెక్నాలజీ షేర్ 19 రెట్లు అధికంగా ట్రేడ్ అవుతోందని తెలిపారు. అలాగే, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్), మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నిష్పత్తి 10 నుంచి 11 రెట్లు ఉండగా, మెటా (ఫేస్‌బుక్) నిష్పత్తి 7.5 రెట్లుగా ఉందని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా 2000వ దశకం ప్రారంభంలో డాట్-కామ్ బబుల్ పగిలిపోయిన తర్వాత సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుడు స్కాట్ మెక్‌నీలీ చేసిన వ్యాఖ్యలను శ్రీధర్ వెంబు గుర్తుచేశారు. "ఒక కంపెనీ ఆదాయానికి 10 రెట్లు చెల్లించి షేర్లు కొంటే, ఆ పెట్టుబడిపై రాబడి రావాలంటే, ఆ కంపెనీ వరుసగా పదేళ్లపాటు తన పూర్తి ఆదాయాన్ని వాటాదారులకే పంచాలి" అని మెక్‌నీలీ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ, ప్రస్తుత పరిస్థితుల తీవ్రతను వివరించారు. "ఇది ఒక అసహజమైన, భారీ బబుల్. బహుశా 1999 నాటి బబుల్ కంటే కూడా పెద్దది" అని వెంబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఏఐ రాకతో ఉత్పాదకత, వృద్ధి గణనీయంగా పెరుగుతాయన్న అంచనాలతో టెక్ షేర్లు రికార్డు స్థాయికి చేరిన తరుణంలో వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Sridhar Vembu
Zoho Corporation
AI bubble
artificial intelligence
tech market bubble
dot com bubble
Nvidia
Micron Technology
stock market
price to sales ratio

More Telugu News