చంద్రుడ్ని చుట్టి.. నేలకు చేరి: ఐదు దశాబ్దాల ‘చంద్రుడి వృక్షాల’ గుట్టు!

Moon Trees Seeds That Orbited the Moon
  • చంద్రుడి చుట్టూ తిరిగొచ్చిన విత్తనాలే ‘మూన్ ట్రీస్’
  • అపోలో 14 వ్యోమగామి ఆలోచనతోనే ప్రయోగం ప్రారంభం
  • అంతరిక్ష ప్రయాణం విత్తనాలపై ప్రభావం చూపలేదు
  • ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆఫీసుల్లో మొక్కలు
  • ఆర్టెమిస్ మిషన్‌లోనూ విత్తనాలను పంపిన నాసా
అంతరిక్ష ప్రయోగాల్లో మానవ మేధస్సుకు నిదర్శనంగా నిలిచే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. కానీ ఐదు దశాబ్దాల క్రితం నాసా చేపట్టిన ఓ వినూత్న ప్రయోగం మాత్రం భూమిపై పచ్చని జ్ఞాపకంగా మారింది. చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చిన వందలాది విత్తనాలు.. నేడు భూమిపై మహావృక్షాలుగా మారి అంతరిక్ష చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ఎలా మొదలైంది ఈ వింత ప్రయోగం?
అపోలో 14 మిషన్ కమాండ్ మాడ్యూల్ పైలట్ స్టూవర్ట్ రూసా ఆలోచనల నుంచి ఈ ‘మూన్ ట్రీస్’ (చంద్రుడి వృక్షాలు) ప్రాజెక్ట్ పుట్టింది. రూసా వ్యోమగామి కాకముందు అడవుల్లో కార్చిచ్చులను ఆర్పే ‘స్మోక్‌జంపర్’గా పనిచేశారు. ఆ అనుభవంతో అమెరికా అటవీ శాఖ, నాసా కలిసి పైన్, సికామర్, రెడ్‌వుడ్ లాంటి కొన్ని రకాల చెట్ల విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి.

చంద్రుడి కక్ష్యలో ప్రదక్షిణలు
అపోలో 14 వ్యోమనౌక 1971 జనవరి 31లో నింగికి ఎగిరింది. మిగతా వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్నప్పుడు రూసా తన పర్సనల్ కిట్‌లో ఉన్న విత్తనాలతో కలిసి కక్ష్యలోనే ఉండిపోయారు. ఈ విత్తనాలు చంద్రుడి ఉపరితలాన్ని తాకకపోయినా అంతరిక్షంలో కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి భూమికి సురక్షితంగా తిరిగొచ్చాయి.

శాస్త్రవేత్తలను భయపెట్టిన ప్రమాదం
భూమికి చేరిన తర్వాత ప్రయోగశాలలో విత్తనాల కంటైనర్లు ప్రమాదవశాత్తూ పేలిపోయి విత్తనాలన్నీ చెల్లాచెదురయ్యాయి. దీంతో ప్రయోగం పాడైపోయిందని శాస్త్రవేత్తలు కంగారుపడ్డారు. కానీ వాటన్నింటినీ సేకరించి నాటగా చాలా విత్తనాలు మొలకెత్తాయి. సాధారణ విత్తనాలతో పోల్చి చూసినప్పుడు వీటి ఎదుగుదలలో ఎలాంటి తేడా కనిపించకపోవడం గమనార్హం.

ఎక్కడున్నాయి ఈ వృక్షాలు?
1975-76లో ఈ మొక్కలను దేశవ్యాప్తంగా నాటారు. వైట్ హౌస్, నాసా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలతో పాటు బ్రెజిల్, స్విట్జర్లాండ్, జపాన్ దేశాలకు కూడా వీటిని పంపారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి రికార్డులు లేకపోవడంతో ప్రస్తుతం వీటిలో ఎన్ని బతికున్నాయో కచ్చితంగా తెలియదు.

ఎవరికీ తెలియని రహస్యం
ఈ చెట్లు మిగతా సాధారణ చెట్లలాగే కనిపిస్తాయి తప్ప వీటికి ఎలాంటి ప్రత్యేక గుర్తులు ఉండవు. కేవలం చెట్టు పక్కన ఉండే చిన్న బోర్డు మాత్రమే దీని అంతరిక్ష చరిత్రను చెబుతుంది. కాలక్రమేణా కొన్ని బోర్డులు పాడైపోవడంతో, తాము నీడన కూర్చున్న చెట్టు.. గతంలో చంద్రుడిని చుట్టి వచ్చిన విత్తనం నుంచి మొలకెత్తిందన్న విషయం తెలియకనే చాలామంది దాని కింద తిరుగుతుంటారు.

ఆర్టెమిస్ మిషన్‌తో పునరాగమనం
అపోలో 14 విజయవంతం కావడంతో నాసా తన ‘ఆర్టెమిస్-1’ మిషన్‌లో కూడా మళ్లీ విత్తనాలను అంతరిక్షంలోకి పంపింది. చంద్రుడి అవతలి వరకు ప్రయాణించి వచ్చిన ఆ విత్తనాల మొక్కలను ఇప్పుడు అమెరికాలోని స్కూళ్లు, మ్యూజియంలకు పంచుతున్నారు. చంద్రుడి ప్రయాణాన్ని భూమిపై పచ్చదనంతో ముడిపెడుతూ నాసా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.
Go Back to Shorts
Stuart Roosa
Moon Trees
Apollo 14
NASA
Space Mission
Artemis 1
Seeds
Space Experiment
Forestry
International Collaboration

More Telugu News