45 ఏళ్ల తర్వాత పోలీసుల ఎదుట మావోయిస్ట్ నరహరి లొంగుబాటు.. వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్!

Pasunuri Narahari Surrenders After 45 Years DGP CV Anand Details
  • మే 12న లొంగిపోయిన నరహరి, ఆయన భార్య ధనమ్మ
  • ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
  • దేశ వ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారన్న డీజీపీ ఆనంద్

మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా నాలుగున్నర దశాబ్దాల (45 ఏళ్లు) పాటు పనిచేసిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఆయన భార్య ధనమ్మ మే 12వ తేదీన పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో వీరిద్దరినీ ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కేసు వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపుగా తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు.


2024 నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 822 మంది మావోయిస్టులు 334 ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ వివరించారు. లొంగిపోయిన వారికి రివార్డులను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ కగార్' (Operation Kagar) చేపట్టిందని.. ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాలలో భద్రతా దళాలు నిరంతరం జరిపిన కూంబింగ్ ఆపరేషన్ల వల్లే ఈ స్థాయిలో లొంగుబాట్లు, మార్పులు సాధ్యమయ్యాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ నుంచి 15 మంది, ఒడిశా నుంచి 15 మంది, ఝార్ఖండ్ నుంచి 13 మంది ఉండగా.. తెలంగాణకు చెందిన వారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఒక్కరు ఉన్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జాడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగులు తక్షణమే లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తి పునరావాస సదుపాయాలు, అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.


Go Back to Shorts
Pasunuri Narahari
Maoist leader
Telangana DGP CV Anand
Narahari surrender
Operation Kagar
Maoist surrender
Chhattisgarh Maoists
Central Committee Maoists
Muppalla Lakshmana Rao
Jade Ratnabai

More Telugu News