నోరు అదుపులో పెట్టుకో: బీటెక్ రవికి అవినాష్ రెడ్డి హెచ్చరిక
- వైఎస్ కుటుంబానివి హత్యా రాజకీయాలు అన్న బీటెక్ రవి
- తమ నాయకులను బీటెక్ రవి వాడు వీడు అని మాట్లాడారన్న అవినాశ్ రెడ్డి
- ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవడానికి బీటెక్ రవి ప్రయత్నించాడని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జరిగిన రాజకీయ హత్యలపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలోనే తన తాత వైఎస్ రాజారెడ్డి, బాబాయ్ వివేకానందారెడ్డి హత్యకు గురయ్యారంటూ జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ నేత బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. అసలు రాజకీయ హత్యలకు బాట వేసిందే వైఎస్ కుటుంబమంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా బీటెక్ రవి వ్యాఖ్యలకు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
బీటెక్ రవి స్థాయిని ప్రశ్నిస్తూ అవినాష్ రెడ్డి తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. "బీటెక్ రవి మా నాయకులను వాడు వీడు అనే స్థాయిలో మాట్లాడాడు. అతని గురించి మేము అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు పడుతుంది? ఇసుక, ముగ్గురాయి వ్యాపారాలకు కన్నం వేసి బతికే వ్యక్తి జగన్‌ను చూసి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి" అని హెచ్చరించారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో బీటెక్ రవి అప్పటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంటి చుట్టూ ఎందుకు తిరిగారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను గెలిచిన ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవడానికి రూ.12 కోట్లు ఇప్పించమంటూ బీటెక్ రవి విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడని అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. తన పదవిని అమ్మేసి, వైసీపీ కండువా కప్పుకుంటానని ఆనాడు రవి ప్రతిపాదించగా.. అలాంటి నీచమైన పనులను తాము ప్రోత్సహించబోమంటూ జగన్ స్వయంగా తిరస్కరించారని వెల్లడించారు. ఒకవేళ వైసీపీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్‌ను పట్టుకుని బీజేపీలోకి వెళతానని ఆనాడు రవి బేరసారాలు సాగించాడని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు బీటెక్ రవిదని, అలాంటి వ్యక్తి వైఎస్ కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అవినాష్ రెడ్డి మండిపడ్డారు.