పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత

Vangalapudi Anitha on Abhinay Darshan Political Conspiracy
  • కడప జిల్లాకు చెందిన అభినయ్ కు అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందన్న అనిత
  • గిరిజనులను నమ్మించి పాస్టర్ అవతారమెత్తారని వ్యాఖ్య
  • తనపై దాడి జరిగినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్న అనిత

క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారం వెనుక పెద్ద రాజకీయ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై పోలీసులు ఇప్పటికే లోతైన విచారణ జరుపుతున్నారని ఆమె వెల్లడించారు.


రాజకీయ కుట్ర కోణం లేకపోతే కడప జిల్లాకు చెందిన అభినయ్ దర్శన్... అంతదూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. అమాయకపు గిరిజనులను నమ్మించి ఆయన పాస్టర్ అవతారం ఎత్తారని ఆమె ఆరోపించారు. అక్కడ ఆయనపై ఎలాంటి దాడి జరగకపోయినా, జరిగినట్లుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ డ్రామా వెనుక ఎవరెవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తులో త్వరలోనే పూర్తిగా బయటపడుతుందని ఆమె స్పష్టం చేశారు.

అభినయ్ దర్శన్‌పై గతంలోనే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన నిరంతరం ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా అప్రదిష్ఠ పాలుచేయాలనే దురుద్దేశంతోనే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారా అనే యాంగిల్‌లో కూడా విచారణ సాగుతోందన్నారు.


కూటమి ప్రభుత్వ హయాంలో ఇటువంటి నాటకాలు, కుట్రలు అస్సలు చెల్లవని, ఇలాంటి ఆలోచనలు ఇంకెవరికైనా ఉంటే తక్షణమే మానుకోవాలని ఆమె హితవు పలికారు. చట్టాన్ని అతిక్రమించి సమాజంలో అలజడులు సృష్టించాలని చూస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు అభినయ్ దర్శన్‌ను త్వరలోనే పోలీస్ కస్టడీలోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

Go Back to Shorts
Vangalapudi Anitha
Abhinay Darshan
Andhra Pradesh politics
political conspiracy
Christian preacher
Home Minister
criminal cases
Alluri Sitarama Raju district
tribal people
police investigation

More Telugu News