గర్భం దాల్చిన పదో తరగతి అమ్మాయి... నిందితుడిపై పోక్సో కేసు నమోదు
- రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ గ్రామంలో ఘటన
- ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన గిరిజన బాలిక
- సొంత గ్రామానికి చెందిన యువకుడి కారణంగా గర్భం దాల్చిన వైనం
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో పదో తరగతి చదివిన ఒక మైనర్ గిరిజన విద్యార్థిని గర్భం దాల్చిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. బాధితురాలు ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ గ్రామానికి చెందిన గిరిజన బాలిక. ఆమె ఆమనగల్లులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది.
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన అనంతరం, సదరు బాలిక ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి అనే విషయం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడి కారణంగా ఆమె గర్భం దాల్చించి. ఈ విషయం బయటకు రావడంతో గ్రామంలోని కుల పెద్దలు మొదట పంచాయితీ సైతం నిర్వహించినట్లు సమాచారం.
అయితే, మైనర్ బాలిక గర్భం దాల్చిన ఉదంతంపై సమాచారం అందగానే పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక మైనర్ కావడంతో నిందితుడిపై కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేశారు. బాధితురాలైన బాలికకు రక్షణ, వైద్య సంరక్షణ కల్పించేందుకు గాను అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని ప్రభుత్వ కేర్ టేకర్ హోమ్‌కు (ప్రభుత్వ రక్షణ కేంద్రానికి) తరలించారు. పోలీసులు ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.